పంట చేతికొచ్చే టైంలో పెద్ద కష్టం

పంట చేతికొచ్చే టైంలో పెద్ద కష్టం

మునుగుతున్న వరి, పత్తి, మిర్చి, మక్క చేన్లు

హైదరాబాద్‌‌, వెలుగు: చెడగొట్టు వానలు రైతులను ఆగం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వానలతో వరి పంటలు నేలకు ఒరుగుతున్నాయి. పత్తి, మిర్చి, మక్క పంటలూ తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పంటలు చేతికొచ్చే టైంలో ఇలా చెడగొట్టు వానలు మోపవడంతో రైతన్నలు ఆందోళనలో మునుగుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు షురూ అయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో పొట్ట దశలో, కోత దశలో ఉన్నాయి. చివరి దశలో ఉన్న పంటలు వానల వల్ల నేలకు వాలిపోతున్నాయి. కోతలు షురూ అయిన చోట కల్లాల్లోనే వడ్లు తడిసిపోతున్నాయి. చేతికి వచ్చిన పంట ఇలా వర్షాలకు తడిసి ముద్దవుతుండటంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. వరితో పాటు పత్తి, మిర్చి, మక్క వంటి పంటలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రధానంగా రంగారెడ్డి, మెదక్‌‌, సిద్ధిపేట, నల్గొండ, నిజామాబాద్‌‌, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో పంటలపై వానల ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌‌లో 64.54 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వారం రోజులుగా రోజు ఏదో ఒక టైమ్‌‌లో కురుస్తున్న వానలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముందుగా వేసిన పంటలు ఇప్పుడు చివరి దశకు చేరాయి. చెడగొట్టు వానల వల్ల వడ్ల గింజలు రాలిపోతున్నాయి. ఆలస్యంగా నాట్లు వేసిన పొలాలు ఇప్పుడు పొట్టదశలో ఉన్నాయి. వానలతో ఇవి కూడా తీవ్రంగా  దెబ్బతింటున్నాయి.

పత్తి, మిర్చి, మక్కలపైనా ఎఫెక్ట్ 

వాతావరణ మార్పులతో కురుస్తున్న అకాల వర్షాలు పంటలపైనా ప్రభావం చూపుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్​లో వరి తర్వాత అత్యధికంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి చేన్లు ప్రస్తుతం కాత దశ నుంచి పత్తి వచ్చే దశలో ఉన్నాయి. ఇప్పుడు వర్షాలతో పత్తి పంటలకు నష్టం జరుగుతోంది. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో పత్తి పంటకు పూత, పిందెలు రాలిపోతున్నయి. కాయలు కుళ్లిపోతున్నయి. దూది దశలోని పత్తి పంటలు వానలకు దెబ్బతింటున్నాయి. ఇక చెడగొట్టు వానలకు మిరప తోటలు కూడా నాశనమవుతున్నాయి. తోటల్లో నీళ్లు నిలిచిపోతుండటంతో వేర్లు కుల్లిపోయి మొలకలు ఎర్రబారి పోతున్నాయి. అకాల వర్షాలకు మక్క రైతులు కూడా ఆగమవుతున్నారు. ఈ సీజన్‌‌ ప్రారంభంలో వానల వల్ల15 లక్షల ఎకరాల్లో పంటలపై ప్రభావం పడగా.. ఇప్పుడు పంటల చివరి దశలోనూ చెడగొట్టు వానలతో నష్టపోవాల్సి వస్తోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.