అసమానతలు రూపుమాపడానికే బహుజన బతుకమ్మ

అసమానతలు రూపుమాపడానికే బహుజన బతుకమ్మ

జనగామ/పాలకుర్తి, వెలుగు : బహుజనుల బతుకులు మారాలని, అసమానతలు రూపుమాపడానికే బహుజన బతుకమ్మ నిర్వహిస్తున్నామని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రథ సారధి, ప్రజా గాయని విమలక్క అన్నారు. మంగళవారం జనగామలోని బతుకమ్మ కుంట, పాలకుర్తి మండలం మంచుప్పులలో బహుజన బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. వీటికి విమలక్క ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. ఆమె మాట్లాడుతూ మాల వాడ, మాదిగ వాడ, కుమ్మరి వాడ వేరుగా కాకుండా ఊరంతా ఒక్కటిగా పిలిచే రోజున నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లన్నారు.  బహుజనుల పండుగ బతుకమ్మకు దళితులు ఇంతకాలం దూరం చేయబడ్డారని,  బతుకమ్మకు అంటూ, ముట్టూ కులం, మతం లేదన్నారు. ఇప్పటికైనా అందరూ కలిసి ఊరి మద్యలో ఆడుకోవాల్సిన అవసరముందన్నారు.  

మంచుప్పుల దళితులకు న్యాయం చేయాలి..

మంచుప్పుల దళితులకు 1993లో ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చారని, వాళ్ల భూముల్లో డబుల్ బెడ్​రూంలు కట్టి వారికి ఇవ్వకపోవడం అన్యాయమని విమలక్క అన్నారు. దళితులకు మద్దతుగా మంచుప్పులకు వచ్చినట్లు చెప్పారు. సాదిక్​ఆలీ, డాక్టర్​రాజమౌళి, డాక్టర్​ కల్నల్​భిక్షపతి, కాకర్ల రమేశ్​,  మామిండ్ల రమేశ్, మాచర్ల సారయ్య, బత్తుల సత్తయ్య, నాగన్న, మహిళలు పాల్గొన్నారు.