న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో నిందితుడు షర్జీల్ ఇమామ్‌కు ఢిల్లీ కోర్టు ఏడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన కజిన్ పెళ్లికి హాజరయ్యేందుకు బెయిల్ ఇవ్వాలంటూ ఇమామ్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 4 నుంచి 10 వరకు ఇమామ్ కు బెయిల్ ఇచ్చింది.
ఈ పిటిషన్‌పై అదనపు సెషన్స్ జడ్జి సమీర్ బాజ్‌పాయ్ విచారణ జరిపి బెయిల్‌కు అనుమతించారు. 2020 ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)కి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా ఈశాన్య ఢిల్లీలో హింస చెలరేగింది.
ఈ ఘటనల్లో 53 మంది చనిపోగా.. 700 మందికి పైగా గాయపడ్డారు. అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలతో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ సహా పలువురిపై యూఏపీఏ, ఐపీసీ కింద కేసులు నమోదయ్యాయి.
విచారణ ప్రారంభించకుండానే తమను ఎక్కువ కాలం జైలులో ఉంచడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమంటూ ఇమామ్, ఉమర్ ఖాలిద్ గతంలో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, వారి బెయిల్ పిటిషన్లను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. తాజాగా కుటుంబ వేడుకకు హాజరయ్యేందుకు షర్జీల్ ఇమామ్‌కు మాత్రమే 7 రోజుల బెయిల్ లభించింది.
