
సికింద్రాబాద్, వెలుగు: తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలయ్యాక వారానికి ఒక రోజు చిలకలగూడ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించించి. ఎలాంటి వ్యక్తిగత దూషణలు చేయరాదని చెప్పింది. ప్రజలను రెచ్చగొట్టే వీడియోలు గానీ, ప్రసంగాలు గానీ తన సొంత చానల్లో టెలికాస్ట్ చేయొద్దని కండీషన్ పెట్టింది. బెదిరింపు కాల్స్ చేసినట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులెవరైనా ఫిర్యాదు చేస్తే విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని బెయిల్ ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొం ది. తనను డబ్బుల కోసం బెదిరించారంటూ సికింద్రాబాద్ సీతాఫల్‌మండికి చెందిన మారుతీ జ్యోతిష్యాలయ నిర్వాహకుడు సన్నిదానం లక్ష్మికాంత్ శర్మ వేసిన కేసులో మల్లన్నకు కోర్టు ఇదివరకే14 రోజుల రిమాండ్ విధించింది. ఆ గడువు ఈ నెల 9తో ముగియడంతో మల్లన్న తరఫు లాయర్ సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. రిమాండ్ సమయంలోనే 4 రోజుల పోలీస్ కస్టడీ కూడా ముగిసిందని, బెయిల్ ఇవ్వాలని కోరగా కోర్టు మంజూరు చేసింది. మల్లన్నపై చిలకలగూడ స్టేషన్లో ఓ కేసు, సీసీఎస్ స్టేషన్లో 4 కేసులుపెండింగ్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.