ఎస్సీ ఉప కులాల సమస్యలు పరిష్కరించాలి: బైరి వెంకటేశం

ఎస్సీ ఉప కులాల సమస్యలు పరిష్కరించాలి:  బైరి వెంకటేశం

హైదరాబాద్/జూబ్లీహిల్స్, వెలుగు : ఎస్సీ ఉప కులాల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో బైరి వెంకటేశం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లిహిల్స్​లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్​కు వివరించారు. ఎస్సీ ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

తమ విజ్ఞప్తులపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని బైరి వెంకటేశం ప్రకటనలో తెలిపారు. ‘‘ఆర్డీవో నుంచి కాకుండా తహసీల్దార్ నుంచే ఎస్సీ ఉప కులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఎస్సీ ఉప కులాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సహకరించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు’’అని బైరి వెంకటేశం పేర్కొన్నారు.

దళిత ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత పదేండ్లుగా పోరాడుతున్నామన్నారు. ఎస్సీ ఉప కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని తెలిపారు. ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్​లలో ఉప కులాల కార్పొరేషన్ ప్రస్తావన లేకపోవడం తమకు నిరాశ కలిగించిందని చెప్పారు. కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం రేవంత్ హామీ ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు.