Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలకృష్ణ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్

Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలకృష్ణ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్

ఎమ్మెల్యే, హీరో, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఈ నెల 30న బాలకృష్ణను సత్కరించనున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో పాటుగా బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి,హీరో నారా రోహిత్‌ తదితరులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

Also Read : గామా అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఈవెంట్ లో గత్తర లేపిన ఫరియా..

లేటెస్ట్గా (ఆగస్ట్ 25న) బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ విషెష్ చెబుతూ..‘‘బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి ఎన్నో చిత్రాల్లో నటించారు బాలకృష్ణ. అందులో జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్నారు.

ఈ తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం MLA,పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పవన్ తెలిపారు. 

బాలకృష్ణ ప్రయాణం దేశ చలనచిత్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. 50 సంవత్సరాల పాటుగా సినిమా పట్ల బాలకృష్ణకు ఉన్న అంకితభావం వల్లే ఈ గుర్తింపు వచ్చిందని అన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, UK ద్వారా గుర్తింపు పొందడం ఆయన అసాధారణ ప్రయాణానికి నిదర్శనం. ఈ చారిత్రాత్మక మైలురాయిపై మన ప్రియమైన బాలయ్యకు అభినందనలని సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 

బాలకృష్ణకు ఈ 2025 ఏడాది అద్భుతమైన జ్ఞాపకాల్ని అందించింది. 2025 జనవరి 25న భారత అత్యున్నత మూడో పురస్కారం పద్మ భూషణ్ అవార్డు వరించింది. అలాగే, మొన్నటికి మొన్న 71వ నేషనల్ అవార్డుల్లో టాలీవుడ్‌ నుంచి ఉత్తమ చిత్రం అవార్డుకు బాలకృష్ణ నటించిన ‘భగవంత్‌ కేసరి’ ఎంపికయ్యింది. ఈ క్రమంలోనే UK వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడం విశేషం. ఇకపోతే, బాలకృష్ణ సినీ జీవితం 1974లో ‘తాతమ్మ కల’తో మొదలైంది. ఇప్పటికీ దాదాపు 110 సినిమాల్లో నటించి, విజయవంతగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కానుంది.