రేణు అగర్వాల్ కేసులో ఆధారాలు దొరికాయి.. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం: బాలనగర్ డిసిపి సురేష్ కుమార్

రేణు అగర్వాల్ కేసులో ఆధారాలు దొరికాయి.. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం: బాలనగర్ డిసిపి సురేష్ కుమార్

హైదరాబాద్ కూకట్ పల్లిలోని స్వాన్ లేక్ అపార్టుమెంట్ లో మహిళను కుక్కర్ తో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పనిమనిషే ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హఫీజ్ పేట్ ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర నిందితులు వదిలివెళ్లిన స్కూటీని గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో రేణు అగర్వాల్ కేసుకి సంబంధించి కీలక ఆధారాలు లభించినట్లు వెల్లడించారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్.

రేణు అగర్వాల్ కేసుకు సంబంధించి మరికొన్ని ఆధారాలు లభించాయని.. ఐదు బృందాలతో పాటు సీపీఎస్, లా అండ్ ఆర్డర్ పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు.నిందితులు ఎక్కడెక్కడికి వెళ్లే అవకాశం ఉందో ఆయా ప్రాంతాలకు బృందాలను పంపామని అన్నారు. హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ వరకు నిందితుల ఫుటేజ్ లభించిందని వెల్లడించారు సురేష్ కుమార్.

ఇతర రాష్ట్రాలకు చెందిన పనిమనుషులను పనిలో పెట్టుకునేటప్పుడు వారి వివరాలు తీసుకోవాలని... ఇతర రాష్ట్రాల పనిమనిషితోనే పెట్టుకునేటప్పుడు మాకు సమాచారం ఇస్తే వారి నేర చరిత్ర పరిశీలిస్తామని అన్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు శరవేగంగా సాగుతోందని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు డీసీపీ సురేష్ కుమార్.