కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండు.. హైకోర్టులో కాంగ్రెస్ పిటీషన్

కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండు.. హైకోర్టులో కాంగ్రెస్ పిటీషన్

ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ రెచ్చగొట్టే విధంగా. విద్వేషాలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నారని.. వెంటనే అతన్ని కట్టడి చేయాలని.. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ యువ నేత బల్మూరి వెంకట్. కొత్త ప్రభాకర్ పై దాడి అనంతరం.. కేసీఆర్ చేసిన ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కు కంప్లయింట్ చేసినా.. పట్టించుకోలేదంటూ ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 

బాన్సువాడ బీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు, రెచ్చగొట్టిన విధానం, చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు బల్మూరి వెంకట్. కేసీఆర్ వ్యాఖ్యలు తర్వాత కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల దాడులు పెరిగాయని.. భయాందోళనలకు గురి చేస్తున్నారంటూ పిటీషన్ లో స్పష్టం చేశారాయన. తగిన ఆధారాలు సమర్పించానని.. వెంటనే విచారించి సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. 

ఈ పిటీషన్ పై విచారణ నవంబర్ 16వ తేదీ గురువారం జరిగే అవకాశం ఉంది. అసలు పిటీషన్ ను విచారణకు స్వీకరిస్తారా లేదా అనే విషయం కూడా ఆ రోజే తేలనుంది.