వెంకట్​ అరెస్టు దుర్మార్గం     

వెంకట్​ అరెస్టు దుర్మార్గం     

హైదరాబాద్, వెలుగు: ఎన్ఎస్​యూఐ స్టేట్​ప్రెసిడెంట్​బల్మూరి వెంకట్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గం, అప్రజాస్వామికమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యపై ఒక విద్యార్థి నాయకుడిగా ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగ హక్కు అని ఆయన అన్నారు. శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన ప్రభుత్వ తీరుపై ఫైర్​అయ్యారు. హక్కులను కాలరాస్తూ పోలీసులు కాంగ్రెస్ నాయకుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  లేదంటే ప్రజా పోరాటం మరింత విస్తరించి ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు.
బుద్ధి లేని గాడిదకు కోపమెందుకు?
“కల్వశుంఠ” కళ్లముందు కనిపిస్తుండగా “గాడిద” దొంగతనం కేసు పెట్టడం దుర్మార్గమని రేవంత్ ​ట్వీట్ ​చేశారు. నిరుద్యోగ యువత కోసం ప్రశ్నిస్తే “బుద్ధిలేని” గాడిదకు కోపం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. అంతకు ముందు ‘వెలుగు’లో పబ్లిష్​ అయిన బడ్జెట్ స్టోరీని పోస్టు చేస్తూ ట్వీట్ ​చేశారు.“బడ్జెట్ అంకెలు చూస్తే బారెడు.. విడుదల చేసిన నిధులు చూస్తే ఇంచెడు”అని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులను మోసం చేస్తున్న తీరు, బడ్జెట్ పత్రాన్ని చిత్తు కాగితం కింద మార్చిన ఘనత కేసీఆర్ దే అని రేవంత్ ఆరోపించారు. బై బై కేసీఆర్ అని హాష్ ట్యాగ్ లో ట్వీట్ పోస్ట్ చేశారు.