బండారు విజయలక్ష్మి రాజకీయ ప్రవేశంపై క్లారిటీ

బండారు విజయలక్ష్మి రాజకీయ ప్రవేశంపై క్లారిటీ

రాజకీయ రంగ ప్రవేశంపై హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అలయ్ బలయ్’ ఫౌండర్ చైర్ పర్సన్ గానూ వ్యవహరిస్తున్న ఆమె పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో తనకు అవకాశం కల్పించే అంశంపై తుది నిర్ణయం బీజేపీదేనని స్పష్టం చేశారు.  తాను పార్టీకి పనికొస్తనని భావిస్తే.. సేవలను తప్పకుండా వినియోగించుకుంటారని తెలిపారు. ‘‘బీజేపీలో ఒక ఏరియా అనుకొని పనిచేయం. మేం పార్టీ కోసం పనిచేస్తం. ముషీరాబాద్ నియోజకవర్గం అనే కాదు..ఎక్కడి నుంచైనా పార్టీ అవకాశం ఇవ్వొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ చెప్పిన ప్రకారం నడుచుకుంటానని బండారు విజయలక్ష్మి  వెల్లడించారు. ‘‘ ప్రతిసారిలాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ సంస్కృతిని అందరికి గుర్తు చేసేందుకు అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించాం.ఈసారి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నం. రుచికరమైన వంటకాలను తయారు చేయించాం’’ అని తెలిపారు. గవర్నర్ తమిళిసైకి ఇతరత్రా కార్యక్రమాలు ఉండటంతో ఈరోజు అలయ్ బలయ్ కు రాలేకపోయారని ఆమె చెప్పారు. 

ఇక అంతకుముందు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్.. బలయ్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానించారు. సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 2005 నుంచి ఏటా దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈఏడాది ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.