ఇద్దరు సీఎంల మీటింగ్ ను బీజేపీ స్వాగతిస్తుంది: బండి సంజయ్

ఇద్దరు సీఎంల మీటింగ్ ను బీజేపీ స్వాగతిస్తుంది: బండి సంజయ్

విభజన సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశాన్ని బీజేపీ స్వాగతిస్తుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. జూలై 6వ తేదీ బండి సంజయ్ మీడియాతో చిట్ చాట్ చేశారు.  రెండు రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరగాలన్నారు. లేదంటే  ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమం చేయాలని గోతి కాడ నక్కల లాగా కొంత మంది చూస్తున్నారని విమర్శించారు.

నిరుద్యోగుల ఆందోళనలు డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ చేరికల డ్రామా ఆడుతోందని బండి సంజయ్ అన్నారు. రేవంత్ రెడ్డి, ఓవైసీ కలిసి పోయారని.. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని.. మా కార్యకర్తలు తలుచుకుంటే ఒక్కరు కూడా రోడ్ల మీద తిరగరని హెచ్చరించారు.

కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో పెట్టిందని.. కానీ అమలు చేయటం లేదని ఆయన మండిపడ్డారు. 26మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కాంగ్రెస్  నేతలు అంటున్నారని..  ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు పెడితే.. 26 చోట్ల బీజేపీ గెలుస్తుందన్నారు. బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలన్నారు. తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమని చెప్పారు. ఈడీ దాడులు చేసిన వ్యక్తులను నేర నిరూపణ అయ్యేవరకు బీజేపీలో చేర్చుకోమని బండి సంజయ్ అన్నారు.