- ఇందుకోసం ఒవైసీ డైరెక్షన్లో కొన్ని పార్టీలు పనిచేస్తున్నయ్
- జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో బండి సంజయ్ ఆరోపణ
జూబ్లీహిల్స్, వెలుగు: భారతదేశాన్ని 2047 నాటికి ఇస్లాం దేశంగా మార్చేందుకు ఎంఐఎం అధినేత అస దుద్దీన్ ఒవైసీ డైరెక్షన్ లో కొన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించా రు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ తప్ప ఏ పార్టీ గెలిచినా హిందువులు అడుక్కునే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం యూసఫ్‌గూడ నుంచి బోరబండ సైట్ -3 వరకు జరిగిన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీ డీకే అరుణతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు.
బోరబండలో ఆయన మాట్లాడు తూ.. ‘‘జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలిచినా, మాగం టి సునీత గెలిచినా కమ్యూనిటీ హాల్స్ అన్నీ మసీదులు, దర్గాలు అయితయ్. హిందువుల పండుగలకు ఇబ్బందులు తప్పవ్. నియోజకవర్గంలో మూడు లక్షల వరకు ఉన్న హిందువులందరూ ఏకతాటి పైకి వచ్చి బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డిని గెలిపించుకోకపోతే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయితది” అని పేర్కొన్నారు.
‘‘భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చేందుకు ఒవైసీ కలలుగంటుంటే.. రేవంత్ రెడ్డి కూడా ఒవైసీకి అనుకూలంగా ఉన్నడు. రాష్ట్రం బాగుండాలంటే, జూబ్లీ హిల్స్ బాగుండాలంటే బీజేపీని గెలిపించాలి” అని బండి సంజయ్ అన్నారు.
హిందువుల సత్తా చూపెట్టాలి: కిషన్‌రెడ్డి
యూసఫ్ గూడలో సీఎం రేవంత్ రెడ్డికి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి మన హిందువుల సత్తా ఏమిటో చూపించే అవకాశం వచ్చింది” అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. యూసఫ్ గూడలో ఆయన మాట్లాడారు. ‘‘జూబ్లీహిల్స్ లో గుర్తు మారింది కానీ, అభ్యర్థి ఒక్కరే.. పతంగి గుర్తు స్థానంలో చేయి గుర్తు పెట్టుకుని నేడు ఓట్లు అడుగుతున్నరు” అని వ్యాఖ్యానించారు.
ముస్లింలకు శ్మశాన వాటిక కోసం స్థలాలు కేటాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బంజారాహిల్స్ లోని అమ్మవారి గుడికి 50 గజాలు స్థలం కేటాయించేందుకు మనసొప్పడం లేదు. హిందువులందరూ బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి” అని ఆయన అన్నారు.
