
హైదరాబాద్, వెలుగు: TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ బాధ్యుడు మంత్రి కేటీఆరేనని, ఆయనను బర్తరఫ్ చేసి, లోపలేసే దమ్ము సీఎం కేసీఆర్‌కు ఉందా అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘టీఎస్‌పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదే.. ‘తప్పు ఎవరు చేసినా, చివరకు నా కొడుకు, బిడ్డనైనా ఊరుకునేది లేదు’ అని అసెంబ్లీలో చెప్పిన మాటలకు కేసీఆర్ కట్టుబడి.. కొడుకును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తరా?’’ అని నిలదీశారు. టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేసినందుకు అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న బీజేవైఎం నాయకులను గురువారం పార్టీ నేతలతో కలిసి సంజయ్ పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘ పేపర్స్ లీకేజీ ల విషయంలో స్టేట్‌లోని లక్షలాది యువత తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనచేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ తోపాటు పలువురు కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి.. జైలుకు తరలించడం దుర్మార్గం. లీకేజీపై ప్రశ్నించడమే వారు చేసిన తప్పా?’’ అని ప్రశ్నించారు. లీకేజీ నేరస్తులకు మాత్రం రాచమర్యాదలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘రాజు నేత అనే కార్యకర్తకు చిన్న పిల్లలున్నారు. వాళ్ల ఆలనాపాలనా ఆయనే చూసుకోవాలి. ఆయన తప్పు చేయకపోయినా ఆందోళనలో పాల్గొన్నందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అన్యాయం” అని అన్నారు.
కేసీఆర్ ‘సిట్’ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్
‘‘అసలు పేపర్ లీకేజీ ఎట్లయింది? టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌కు తెలియకుండా జరిగిందా? ముందు వాళ్లను ప్రాసిక్యూట్ చేయాలి. నేరస్తులను కాపాడేందుకే సిట్ వేశారు. మియాపూర్ భూములు, డ్రగ్స్, నయీం కేసులపై వేసిన సిట్‌లు ఏమయ్యాయి? కేసీఆర్ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండే.. అదే సిట్” అని సంజయ్ ఎద్దేవా చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి అభ్యంతరమెందుకని, ఇదంతా కేసీఆర్ కొడుకు ఆడుతున్న డ్రామా కాదా అని నిలదీశారు. ‘‘ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర క్లియర్‌గా ఉంది. ఐటీ శాఖ ఫెయిల్యూర్ ఉంది. కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ డ్రామా ఆడుతున్నాడు. బీజేపీ పాత్ర ఉందని సిగ్గు లేకుండా ఆరోపిస్తున్నారు. రాజశేఖర్ అనే వ్యక్తి బీజేపీ నాయకుడని అంటున్నారు. అతను 2017 నుంచి తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఉద్యోగి. ఐటీశాఖ పరిధిలో ఉంటుంది. మరి ఇన్నాళ్లు ఏం చేస్తున్నట్లు.. అట్లాంటివాళ్లను గుర్తించడం చేతగాని నువ్వు మంత్రిగా ఉండటానికే అనర్హుడివి” అని కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. ‘‘రేణుక తల్లి బీఆర్ఎస్ సర్పంచ్.. ఆమె అన్న బీఆర్ఎస్ నాయకుడు. ఆ కుటుంబం అంతా బీఆర్ఎస్సే.. మరి పేపర్ లీకేజీ ఎవరి కోసం అయ్యింది.. బీజేపీనే లీక్ చేసిందని చెబుతున్న వాళ్లంతా ఎందుకు ఆధారాలు చూపడం లేదు?” అని నిలదీశారు. పరీక్షలు కూడా నిర్వహించలేని చేతగానితనం కేసీఆర్ సర్కార్ దని ఎద్దేవా చేశారు.
నేడు కర్నాటక ఎన్నికల ప్రచారానికి సంజయ్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ చీఫ్ బండి సంజయ్ వెళ్లనున్నారు. శుక్రవారం ఆయన కర్నాటకలోని తుముకూరు జిల్లాలో
తెలుగువారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.
మీకో రూల్.. మిగతా వాళ్లకో రూలా?
బీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబానికి ఒక రూల్.. మిగిలిన వాళ్లకు ఒక రూలా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. చిన్న తప్పు జరిగితే ఆ పార్టీ నేతలను బలి చేసే కేసీఆర్.. ఆయన కొడుకును ఎందుకు బర్తరఫ్ చేయరని సొంత పార్టీ నేతలు నిలదీయాలని సూచించారు. జరిగిన పరిణామాలకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. సర్కారు నిర్వాకం వల్ల నిరుద్యోగులంతా ఆందోళన చెందుతున్నారని, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బేషరతుగా వారిని విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇయ్యాల సంజయ్ నిరసన దీక్ష
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ మేరకు నిరసన చేపట్టనున్నారు. అంతకుముందు గన్ పార్క్ వద్దకు వెళ్లి అమరవీరులకు ఆయన నివాళులు అర్పించనున్నారు.