సబర్మతిలా మూసీ పరిహారం చెల్లించండి : బండి సంజయ్

సబర్మతిలా మూసీ పరిహారం చెల్లించండి : బండి సంజయ్
  •     మూసీ ప్రక్షాళనకు బీజేపీ అనుకూలమే:  బండి సంజయ్
  •     తొక్కుకుంట వచ్చిన అని సీఎం ఇచ్చిన వార్నింగ్ కాంగ్రెస్ సీనియర్లకే.. 
  •     బీజేపీ అధికారంలో ఉండుంటే ఎంఐఎం సభ్యులను మెడలు పట్టి వందేమాతరం పాడించేవాళ్లం

కరీంనగర్, వెలుగు: మూసీ నది ప్రక్షాళనకు బీజేపీ అనుకూలమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నిర్వాసితులకు గుజరాత్​లోని సబర్మతి తరహాలో పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. గురువారం కరీంనగర్​లోని మహాశక్తి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తన ఇంట్లో డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒక్కొక్కరినీ తొక్కుకుంటూ సీఎం సీట్లోకి వచ్చానంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్లకేనని విమర్శించారు. 

ఈ మధ్య ఆ పార్టీలో కొంతమంది సీనియర్లు అసమ్మతి మీటింగ్స్​ పెడుతున్నరు.. వాళ్లను ఉద్దేశించే సీఎం ఆ వార్నింగ్ ఇచ్చినట్లుందని పేర్కొన్నారు. సీఎం వాడుతున్న భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల భాష సైతం అలాగే ఉందని, రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ నేతలు నిలదీయడం లేదని,  బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 

వందేమాతరం బహష్కరించడం దుర్మార్గం 

అసెంబ్లీలో గవర్నర్, స్పీకర్, సీఎం, మంత్రుల సమక్షంలోనే మజ్లిస్ ఎమ్మెల్యేలు వందేమాతరం గీతాలాపనను  బహిష్కరించడం దుర్మార్గమని సంజయ్​మండిపడ్డారు. సభ్యులు తప్పు చేస్తే శిక్షించే అధికారం స్పీకర్​కు మాత్రమే ఉందని, అయినా ఇంతవరకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో స్పీకర్ ఇచ్చిన తీర్పు పట్ల ప్రజల్లో చులకన భావన ఏర్పడిందన్నారు. బీజేపీ అధికారంలో ఉండి ఉండుంటే ఎంఐఎం సభ్యుల మెడలు పట్టి వందేమాతరం పాడించేవాళ్లమని పేర్కొన్నారు.