ప్రజా సంగ్రామ యాత్ర చూసి కేసీఆర్ వణికిపోతుండు

ప్రజా సంగ్రామ యాత్ర చూసి కేసీఆర్ వణికిపోతుండు

గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన ఆయన.. యాదాద్రి జిల్లా వంగపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. చార్మినార్ వద్ద సభ పెట్టి సత్తా చాటామన్న బండి సంజయ్.. బీజేపీ గెలవగానే తొలుత భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటామని చెప్పారు. ప్రతి కార్యకర్త ఉగ్ర నరసింహ స్వామి అవతారమెత్తి కేసీఆర్ను గద్దెదించాలని పిలుపునిచ్చారు.  

బీజేపీ యాత్రతో కేసీఆర్కు వణుకు 
ప్రజా సంగ్రామ యాత్ర చూసి కేసీఆర్ వణికిపోతుండని బండి సంజయ్ అన్నారు. మూడో విడత సంగ్రామ యాత్ర యాదగిరి గుట్ట నుంచి ప్రారంభించడంతో సీఎంకు భయం పట్టుకుందని చెప్పారు. లక్ష్మీ నరసింహ స్వామిని ముంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన తన గతి ఏమవుతుందోనని ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నాడని అన్నారు. కేసీఆర్ సీఎం హోదాలో ఢిల్లీకి పోతే షెడ్యూల్ ఉండదా అని ప్రశ్నించిన బండి సంజయ్.. అసలు ఆయన ఎందుకు హస్తినకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 

నీ మనవడు అదే అన్నం తింటుండా..?
బుక్కెడు బువ్వ కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గోస పడుతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాల్ల్లో పురుగుల అన్నం పెడుతున్నారని, అదే అన్నం కేసీఆర్ మనవడు తింటుండా అని బండి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం ఒరగబెట్టని కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేస్తాడని బండి సంజయ్ సటైర్ వేశారు. రాష్ట్రాన్ని సాధించుకున్నది అవస్థలు పడేందుకేనా అని సీఎంను నిలదీశారు. 

మూర్ఖపు, చేతగాని పాలన
కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. రైతులను నిండా ముంచిన ఘనత కేసీఆర్ కే చెల్లిందని అన్నారు. ఫ్రీ  యూరియా ఇస్తానని పాలాభిషేకం చేయించుకున్న ముఖ్యమంత్రి ఆ హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. వాసాలమర్రికి అభివృద్ధి కోసం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ మూర్ఖపు, చేతగాని పాలన వల్ల చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇప్పటికైనా బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

నిధుల దారి మళ్లింపుపై అవగాహన
కాళేశ్వరాన్ని నిండా ముంచిన ఘనత కేసీఆర్ కు దక్కిందని సంజయ్ విమర్శించారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చుంటే దేశం మొత్తం ఇప్పుడు బీజేపీని నిలదీసేదని అన్నారు. ఏం మొఖం పెట్టుకుని కాళేశ్వరానికి జాతీయ హోదా అడుగుతున్నారని ప్రశ్నించారు. మొదటి విడత పాదయాత్రలో బీజేపీ అధికారంలోకి వస్తే... ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, రెండో విడతలో ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు అమలుచేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని బండి ప్రస్తావించారు. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్న విషయాన్ని  ప్రజలకు చెప్పి, అవగాహన కల్పించేందుకే మూడో విడత పాదయాత్ర చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 

అప్పులు చేసి జనం చేతికి చిప్ప
కేసీఆర్ రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి జనం చేతికి చిప్ప ఇచ్చిండని బండి సంజయ్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు అగ్రకులాల పేదలను మోసం చేస్తున్నాడని విమర్శించారు.  ఎస్టీ రిజర్వేషన్ విషయంలోనూ టీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తోందని, రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, క్యాసినో వ్యవహారాల్లో ఆ పార్టీ నేతలకు సంబంధముందని బండి సంజయ్ అన్నారు. నయీం వ్యవహారంలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, డబ్బు ఏమైందో కేసీఆర్ సమాధానం చెప్పాలనిడిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నింటినీ కక్కిస్తామని చెప్పారు. 

బీజేపీకి అండగా తెలంగాణ సమాజం
బీజేపీ అధికారంలోకి వచ్చాక కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందపెట్టి, బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని బండి హామీ ఇచ్చారు. బీజేపీకి తెలంగాణ సమాజం అండగా ఉందని, ఉద్యోగులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు బయటకు వచ్చి తమ పార్టీకి మద్దతివ్వాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే గడీల్లో బంధీ అయిన తెలంగాణ తల్లి విముక్తురాలవుతుందని అభిప్రాయపడ్డారు.