తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్

తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్

హైదరాబాద్, వెలుగు: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, ప్రజాస్వామిక తెలంగాణను సాధించేందుకు పోరాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. అధికారానికి దగ్గరగా వచ్చామని, ఏ ఎన్నిక వచ్చినా గెలుచుకుని బీజేపీ సత్తా చూపుతుందన్నారు. టీఆర్ఎస్ ఎంత డబ్బు వెదజల్లినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మాత్రం కాషాయ పార్టీ వైపు ఉన్నారన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కల్వకుంట్ల పాలనను భూస్థాపితం చేసే దాకా పోరాడుతామన్నారు. కేసీఆర్ అవినీతి, నియంత, -కుటుంబ పాలనను అంతం చేసి, ప్రజాస్వామిక తెలంగాణను సాధించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ఇందుకోసం బీజేపీ సాగిస్తున్న మహోద్యమానికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం పార్టీ స్టేట్ ఆఫీసులో సంజయ్‌‌‌‌‌‌‌‌ని బీజేపీ సీనియర్ నేతలు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘ఆశీర్వచన’ కార్యక్రమానికి పార్టీ నేతలు లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, స్వామి గౌడ్, రఘునందన్ రావు, మనోహర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ తదితరులు హాజరయ్యారు. వేద పండితులు, పూజారులు సంజయ్‌‌‌‌‌‌‌‌ని ఆశీర్వదించారు.

గొప్ప పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉంది
తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్‌‌‌‌‌‌‌‌లకు సంజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఇంత గొప్ప పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తానిచ్చిన ఏ హామీనీ నెర్చవేర్చకుండా జిమ్మిక్కులు చేస్తున్నారని, ఆయన పాలనలో ప్రజలు విసిగిపోయారని మండిపడ్డారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ ఈ రెండేళ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం అనేక ఉద్యమాలు చేశామని, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతులమయ్యామన్నారు. ఇందులో భాగంగా తనతోసహా అనేక మంది జైలుకు వెళ్లిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ డౌన్ ఫాల్ క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌కు చేరిందని, అందుకే కేంద్రాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా డబ్బులిచ్చి స్ట్రాటజీ టీంలను పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మండిపడ్డారు.

ఏప్రిల్ 14 నుంచి రెండో దశ పాదయాత్ర
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చే ఏప్రిల్ 14 నుంచి రెండో దశ పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు సంజయ్ ప్రకటించారు. బెంగాల్ తరహా రాజకీయాలు చేసినా, తాలిబన్, రజాకార్ల పాలన కొనసాగించినా ఎదిరించి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని, కమలం పువ్వును నిరంతరం వికసింపజేస్తామని తెలిపారు. ఈ మహోద్యమంలో వెన్నంటి ఉన్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సంజయ్ కృతజ్ఞతలు చెప్పారు. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకుంటున్నానన్నారు.