బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్

బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్
  • ఎస్టీ రిజర్వేషన్లు అమలు కాకుండా కేసీఆర్ కుట్ర
  • బీజేపీపై ఆ నెపం నెట్టి సుప్రీంకు వెళ్లి స్టే తెచ్చుకోవాలని స్కెచ్
  • దమ్ముంటే ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై ప్రమాణం చేయాలని సీఎంకు సంజయ్ సవాల్

హైదరాబాద్, వెలుగు: గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ ఆరోపిం చారు. బీజేపీపై ఆ నెపం నెట్టి సుప్రీంకోర్టుకు వెళ్లి, ఎస్టీ రిజర్వేషన్లు అమలు కాకుండా స్టే తెచ్చుకునేందుకు సీఎం స్కెచ్ వేశారని విమర్శించారు. అందులో భాగంగానే ఎస్టీ రిజర్వేషన్లను తాను అడ్డుకుంటున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారని కేసీఆర్ పై సంజయ్ ఫైరయ్యారు. ఎస్టీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నదెవరో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. ఆయన చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలో కొనసాగింది. సంజయ్ పలు చోట్ల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ సర్కార్  ఇంకో 6నెలలే ఉంటుందని, ప్రస్తుతం అది వెంటిలేటర్​పై ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీని ఆదరించాలని కోరారు. ‘‘మహిళల ను గౌరవించడమే మన భారతీయ సంస్కృతి. మహిళలను గౌరవించని నీచ సంస్కృతి టీఆర్ఎస్ వాళ్లది. లిక్కర్ స్కామ్, డ్రగ్స్, పత్తాలు, కబ్జాలు.. ఇలా కేసీఆర్ బిడ్డవే. ప్రజా సమస్యలను పట్టించుకోని ఏకైక సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుని, రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆ సొమ్ము పంచిపెడుతున్నడు. రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని టీఆర్ఎస్ నేతలను గల్లా పట్టి ప్రశ్నించాలి. ఫ్రీగా నీళ్లు ఇస్తానన్న కేసీఆర్... ఒక్కో ఇంటికి500 రూపాయలు వసూలు చేస్తున్నడు”అని సంజయ్ మండిపడ్డారు.

బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్

బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అని బండి సంజయ్ హెచ్చరించారు. గోషామహల్ బీజేపీ కార్యకర్తలను తక్షణమే  విడుదల చేయాలని, లేకపోతే డీజీపీ, టాస్క్ ఫోర్స్ కార్యాలయాల ముందు కూర్చుంటానని పేర్కొన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఉప్పల్​లోని చిలుకా నగర్​చౌరస్తాలో మాట్లాడారు. టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపి గోషామహల్ లోని బీజేపీ కార్యకర్తలను తీసుకుపోయి టార్చర్ పెడతారా అని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా భజనపరులుగా మారి, కేసీఆర్ ను జోకుతున్నారని విమర్శించారు.

అంబేద్కర్ పేరు పెడితే సరిపోదు..

సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కాదని, కొత్త సెక్రటేరియట్ లో ఒక కుర్చీ వేసి, దళితుడిని సీఎంను చేయాలని కేసీఆర్ కు సంజయ్ సవాల్ విసిరారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డను రాష్ట్రపతిగా చేయాలని బీజేపీ అనుకుంటే.. ఆ ఎస్టీ బిడ్డను ఓడించే ప్రయత్నం చేసిన వ్యక్తి  కేసీఆర్ అని ఫైరయ్యారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలకు అధికారం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి చాన్స్​ ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దసరా తర్వాత  ఐదో  విడత ప్రజా సంగ్రామ యాత్ర  చేపట్టబోతున్నానని తెలిపారు.