‘స్పోర్ట్స్‌ కోటా స్టూడెంట్స్‌కు కేసీఆర్‌‌ అన్యాయం చేస్తుండు’

‘స్పోర్ట్స్‌ కోటా స్టూడెంట్స్‌కు కేసీఆర్‌‌ అన్యాయం చేస్తుండు’

స్పోర్ట్స్ కోటా స్టూడెంట్స్ పై కేసీఆర్ ప్రభుత్వం వివక్షత చూపుతోందని , వారికి రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయ‌డం లేద‌ని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా కింద స్టూడెంట్స్ ను కౌన్సిలింగ్ కు ఆహ్వానించడం లేదని, దీంతో ప్రతి సంవత్సరం వందలాది మంది క్రీడా కారులు అవకాశాలు కోల్పోవడమేకాక, తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నార‌ని ఆయ‌న అన్నారు.

సానియా మీర్జా లాంటి క్రీడాకారిణికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి గౌరవించిన కేసీఆర్ కు , సొంత రాష్ట్ర విద్యార్థులు ఎందుకు గుర్తుకు రావడం లేదు? అని సంజ‌య్ ప్ర‌శ్నించారు. 29 క్రీడ‌ల‌కు సంబంధించిన క్రీడాకారులకు ఉద్యోగ ,ఉన్నత విద్య విభాగాల్లో 2% రిజర్వేషన్ ను అమలు చేస్తున్నట్టు ఏప్రిల్ 8, 2018న ప్రకటించారు కానీ ఇంత‌వ‌ర‌కూ అమలుకు నోచుకోలేదన్నారు.

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా అమలు అంశం రెండేళ్లుగా హైకోర్టులో పెండింగ్‌లో ఉందని.. ఆ సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం కమిటీలను నియమించాలని హైకోర్టుకు చెబుతుంద‌న్నారు. ఈ నెల 13 (13- 9- 2020 ) న ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు విద్యార్థులకు నీట్ ఎంట్రన్స్ ఉంది కాబ‌ట్టి… ప్రభుత్వం స్పందించి స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు కౌన్సిలింగ్ కు అవకాశం కల్పించాలన్నారు. స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత కేసీఆర్ దేన‌ని సంజ‌య్ అన్నారు.

Bandi Sanjay criticizes KCR government for discriminating against sports quota students