బోర్లకు మీటర్లంటూ కేంద్రాన్ని బద్నాం చేస్తుండు

బోర్లకు మీటర్లంటూ కేంద్రాన్ని బద్నాం చేస్తుండు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చారో బహిరంగసభల్లో కేసీఆర్ స్పష్టం చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత బీజేపీ, మోడీని తిట్టాలని సూచించారు. లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. రుణమాఫీ లేక రాష్ట్రంలో 31 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక్కడి రైతులను పట్టించుకోడు కానీ..పంజాబ్ వెళ్లి..అక్కడి రైతులకు లక్షలు ఇస్తాడని చెప్పాడు. కాళేశ్వరంతో వేల ఎకరాల్లో పంట మునిగిందని..కేసీఆర్ ఆనాలోచిత నిర్ణయం వల్ల వేలకోట్ల ధనం..వేల ఎకరాల పంట నష్టపోయిందని ధ్వజమెత్తారు. 

లిక్కర్ స్కాంపై మాట్లాడాలి..
బహిరంగ సభల్లో కేసీఆర్ లిక్కర్ స్కాంపై ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ స్కాంపై దేశం మొత్తం చర్చ జరుగుతోందని..కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ పరువుపోయిందని మండిపడ్డారు. సభల్లో లిక్కర్ స్కాం ఆరోపణలను ఎందుకు ఖండించలేదన్నారు. 

రైతులతో పొలాల్లో మీటింగ్ పెట్టు..
మోడీ, కేంద్రాన్ని తిట్టేందుకే రైతు సంఘాలతో కేసీఆర్ మీటింగ్ పెట్టారని బండి సంజయ్ విమర్శించారు. వరి వేస్తే ఉరి అనడంతోఎంతో మంది రైతులు చనిపోయారని.. వారికి ఎంత పరిహారం ఇచ్చావని ప్రశ్నించారు. కేసీఆర్ ముందు రాష్ట్ర రైతులను పట్టించుకోవాలన్నారు. ఇక్కడి రైతులతో పొలాల్లో మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. 

బెల్టు షాపులతో కమీషన్లు..
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బండి సంజయ్ ఆరోపించారు. గ్రామాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం సేవించి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆరోగ్యం పాడుచేసుకుంటుంటే..బెల్టు షాపులు, వైన్స్ ల ద్వారా సీఎం, సీఎం కుటుంబం కమీషన్లు పొందుతోందని ఆరోపించారు. 

మీటర్లు పెడితే ఊరుకోం..
బోర్లకు కేంద్రం మీటర్లు పెడుతుందని ప్రతీ సారి కేంద్రంపై కేసీఆర్ నిందలు మోపుతోందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని బద్నాం చేసేందుకే  బోర్లకు మీటర్ల అంటూ కేసీఆర్ డ్రామాలాడుతున్నారని చెప్పారు. కేంద్రం పేరుతో బోర్లకు కేసీఆర్ మీటర్లు పెడితే బీజేపీ ఊరుకోదన్నారు. 

గురువుగా భావిస్తాం..
అమిత్ షాను తాను గురువుగా భావిస్తామని బండి సంజయ్ అన్నారు. గురు భక్తితోనే చెప్పులను జరిపామన్నారు. చెప్పులు మోయడానికి..జరపడానికి తేడా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రొ జయశంకర్ సర్ నే తన్నిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. అందితే జుట్టు..అందకపోతే కాళ్లు పట్టుకునే రకం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. ఊసరవెళ్లి మాటలు ఆపి..రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.