ఆధ్యాత్మికం: దేవతలు.. రాక్షసులు క్షీరసాగర మథనం.. అమృతం పుట్టిన రోజు ఇదే..!

ఆధ్యాత్మికం:  దేవతలు.. రాక్షసులు క్షీరసాగర మథనం.. అమృతం పుట్టిన రోజు ఇదే..!

క్షీరసాగర మథనం హిందూ పురాణాల్లో ఒక ముఖ్య ఘట్టం, దీనిలో దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలకడం ద్వారా అమృతాన్ని (మరణాన్ని జయించే పానీయం) పొందారని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ఈ సమయంలో హాలాహలం (మహావిషం) పుట్టింది.  దానిని శివుడు సేవించి నీలకంఠుడయ్యాడు.  లక్ష్మీదేవి, కౌస్తుభం, ఉచ్ఛైశ్రవము వంటి ఎన్నో అమూల్య వస్తువులు కూడా ఉద్భవించాయి. చివరికి అమృతం దేవతలకు లభించింది.  ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం..  క్షీర సముద్రం నుంచి అమృతం ఏ రోజున ఉద్భవించిందో తెలుసుకుందాం. . .! 

 దేవుళ్లు అసురులతో యుద్ధాలు చేయలేక ఒకానొక దశలో చాలా విసిగిపోయారు. ఒకసారి రాక్షసులు మరింత బలవంతులై దేవతలను ఓడించారు. విశ్వాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దిక్కుతోచని దేవతలు మహావిష్ణువును శరణు వేడారు. అప్పుడు విష్ణువు క్షీరసాగరం లేదా పాల సముద్రాన్ని మథనం చేస్తే అమృతం వస్తుందని...  దాన్ని తాగితే దేవతలు మళ్లీ బలవంతులు అవుతారు అని చెప్పాడు. అలా పాల సముద్రాన్ని చిలికే సమయంలో అనేక వస్తువులు ఉద్భవించాయి.  అయితే అమృతం పుష్యమాసం శుద్ద ఏకాదశి రోజున పాల సముద్రం నుంచి వచ్చిందని.. ఆ తరువాత వెంటనే విష్ణుమూర్తి వైకుంఠానికి  ఉత్తర ద్వారం ద్వారా వెళ్లాడని.. ఆయన వెంటే మిగిలిన దేవతలు కూడా వెళ్లి ఆయనను స్తుతించి అమృతాన్ని స్వీకరించారని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ముక్కోటి దేవతలు అందరూ కలిసి ఏకాదశి రోజున వైకుంఠంలో అమృతాన్ని స్వీకరించారు కావున పుష్య శుద్దఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని.. ముక్కోటి ఏకాదశి అని అంటారని పండితులు అంటున్నారు. 

ముక్కోటి ఏకాదశిని ..హరి ఏకాదశి...మోక్ష ఏకాదశి....సౌఖ్య ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. శ్రీమన్నారాయణునికి.. సూర్యుడు కుడికన్ను కాగా చంద్రుడు ఎడమకన్నుగా ప్రకాశిస్తారు.   విష్ణువు ఎన్నో రూపాల్లో వ్యక్తమవుతున్నా భగవత్‌ చైతన్యం, ఈశ్వర తత్త్వం ఒక్కటే. అసురశక్తుల బారిన పడకుండా ప్రతికూల శక్తుల్ని ధైర్యంగా ఎదుర్కొని, సానుకూల శక్తుల్ని పెంపొందింప జేసుకోవడానికే ముక్కోటి దేవతలు విష్ణువును ఆశ్రయించారు. విష్ణుకృపను సాధించి మనోభీష్టాల్ని నెరవేర్చుకున్నారు. 

ALSO READ : ముక్కోటి ఏకాదశి ( డిసెంబర్ 30)న ఇలా చేయండి.. కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుంది..!

మురుడు అనే రాక్షసుడు ముక్కోటి దేవతలను నానా రకాలుగా హింసించుచున్న సమయంలో .. విష్ణుమూర్తి దగ్గరకు దేవతలు అందరూ కలిసి వెళ్లారు.   ఆ రాక్షసుడికి ప్రత్యేక వరాలు ఉండటం వలన.. విష్ణుమూర్తి యుద్దంలో అలసిపోయి.. సింహవతి అనే గుహలో సేద తీరే సమయంలో యోగ నిద్రలోకి వెళతాడు.  ఈ విషయాన్ని  గమనించిన మురుడు.. మారు రూపంతో విష్ణుమూర్తిపై దాడికి ప్రయత్నించాడు. అప్పుడు పుష్యమాసం శుక్ల పక్ష్ ఏకాదశి రోజున విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక శక్తి వెలువడి ..అది ఆ రాక్షసుడిని హతమార్చింది. విష్ణువుకు ప్రియమైన తిథిగా ఏకాదశి పేరిట ఆ శక్తి రూపం పూజలందుకుంటుందని పేర్కొన్నాడు. ఆనాటి నుంచి ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తున్నారని  భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. 

సుకేతుడనే రాజు దేవతల ఉపదేశానుసారం ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, విష్ణువు అనుగ్రహం వల్ల సంతాన సిద్ధి పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యవంశ రాజైన రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని తాను ఆచరించడమే కాక, తన రాజ్యంలో అందరిచేత నిర్వహింపజేసి, శ్రీహరికి ప్రియ భక్తుడయ్యాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వైఖానసుడు అనే రాజు పితృదేవతలకు ఉత్తమగతుల్ని అందించడానికి ముక్కోటి ఏకాదశి వ్రతం చేసినట్లు విష్ణుపురాణం వివరిస్తుంది.

హిందువులు ముక్కోటి ఏకాదశిని చాలా విశిష్టమైన రోజుగా పరిగణిస్తారు.   ఆరోజున ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున చేసే పూజలకు శ్రీమన్నారయణుడు.. ఎంతో ప్రీతి చెంది కోరిన కోర్కెలు తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి.  అందుకే ఆ రోజు (2025 డిసెంబర్​ 30) ఎంత ఒత్తిడిలో ఉన్నా... ఎంత కష్టంలో ఉన్నా.. విష్ణుమూర్తని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.