ఒట్టావా: కెనడాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. టొరంటో యూనివర్శిటీ సమీపంలో శివంక్ అవస్థి అనే 20 ఏళ్ల భారతీయ విద్యార్థిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మంగళవారం (డిసెంబర్ 23) హైలాండ్ క్రీక్ ట్రైల్, ఓల్డ్ కింగ్‌స్టన్ రోడ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై టొరంటో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
శివంక్ అవస్థి హత్యపై టొరంటోలోని భారత కాన్సులేట్ స్పందించింది. ‘‘టొరంటో విశ్వవిద్యాలయం స్కార్‌బరో క్యాంపస్ సమీపంలో జరిగిన కాల్పుల సంఘటనలో యువ భారతీయ విద్యార్థి శివంక్ అవస్థి విషాదకరంగా మరణించడంపై తీవ్ర విచారకరం. ఈ క్లిష్ట సమయంలో దుఃఖంలో ఉన్న మృతుడి కుటుంబ సభ్యులకు కాన్సులేట్ అండగా ఉంటం. స్థానిక అధికారుల సమన్వయంతో బాధిత కుటుంబానికి అవసరమైన సహయ సహకారాలు అందిస్తాం ’’ అని పేర్కొంది.
ALSO READ : క్రిస్మస్ వేళ ట్రంప్ సంచలన నిర్ణయం..
టొరంటో స్కార్‌బరో విశ్వవిద్యాలయంలో లైఫ్ సైన్సెస్ విభాగంలో మూడవ సంవత్సరం చదువుతోన్న శివంక్ అవస్థి హత్యతో క్యాంపస్ ఉలిక్కిపడింది. పట్ట పగలు తోటి విద్యార్థిని క్యాంపస్‌లోనే కాల్చి చంపడంతో స్టూడెంట్స్ భయభ్రాంతులకు గురయ్యారు. క్యాంపస్‌లో భద్రతపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిఘా కెమెరాలు, తగినంత భద్రత లేకపోవడం వల్లే ఈ హత్య జరిగిందని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల ఘటనతో టొరంటో విశ్వవిద్యాలయాన్ని అధికారులు తాత్కాలికంగా క్లోజ్ చేశారు.
