కేసీఆర్ ఫ్యామిలీ పాస్​పోర్టులు సీజ్ చేయాలె : బండి సంజయ్

కేసీఆర్ ఫ్యామిలీ పాస్​పోర్టులు సీజ్ చేయాలె : బండి సంజయ్
  • కేసీఆర్ ఫ్యామిలీ పాస్​పోర్టులు సీజ్ చేయాలె
  • బీఆర్ఎస్ నేతలవి,ఆ ఆఫీసర్లవీ స్వాధీనం చేస్కోవాలె : బండి సంజయ్ 
  • లేకుంటే వాళ్లు దేశం విడిచిపారిపోతరు 
  • పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని కామెంట్స్   

కరీంనగర్, వెలుగు :  అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయి ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతల పాస్ పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రిటైర్ అయినా సీఎంవోలో పనిచేస్తూ అడ్డగోలుగా కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టిన అధికారుల పాస్ పోర్టులను సైతం స్వాధీనం చేసుకోవాలన్నారు. లేదంటే వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, అదే జరిగితే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని హెచ్చరించారు. 

అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ ను మాత్రమే ఈ విషయంలో మినహాయించాలని సూచించారు. కరీంనగర్ లోని ఈఎన్ గార్డెన్ లో శనివారం మధ్యాహ్నం బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ పదాధికారుల సమావేశం జరిగింది. పార్టీ కరీంనగర్, వేములవాడ జిల్లాల అధ్యక్షులతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి సహా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఆ పైస్థాయి నాయకులంతా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన్నారు. తెలంగాణలో బీజేపీకి పోటీ కాంగ్రెస్ మాత్రమేనని, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సోదిలో కూడా ఉండదన్నారు.   

బంగారుపళ్లెం అనేందుకు సిగ్గుండాలె..  

తెలంగాణను బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ కు అప్పగించామంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహా బీఆర్ఎస్ నేతలు చెప్పడంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు.  ఆ మాటలు అనేందుకు సిగ్గుండాలని విమర్శించారు. ‘‘తెలంగాణ బంగారు పళ్లెమే అయితే ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలెందుకు ఇవ్వలేకపోయారు? రూ. 6 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయి? ప్రభుత్వ భూములను ఎందుకు అమ్ముకున్నారు? ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు? నిరుద్యోగ భృతి ఎందుకివ్వలేదు?” అని ఆయన ప్రశ్నించారు.