
- 10 వేల కోట్ల పెండింగ్‌తో 15 లక్షల మంది స్టూడెంట్ల జీవితాలు ఆగమయ్యాయని కామెంట్
మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో బకాయి ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు వెంటనే చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా కాలేజీ మేనేజ్మెంట్లు, విద్యార్థులను ఆగం చేసిందని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నదని అన్నారు. కేసీఆర్ చెల్లని చెక్కులు ఇచ్చి పరువు తీయగా.. రేవంత్ రెడ్డి టోకెన్లు ఇచ్చి డబ్బులు ఇవ్వట్లేదని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్, ఫోర్త్ సిటీ, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయి కానీ పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవా? అని నిలదీశారు. ప్రైవేట్ కాలేజీల యూనియన్ నాయకులు కొందరు ప్రభుత్వానికి తాబేదారులుగా వ్యవహరిస్తుండడం వల్లనే ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదన్నారు.
బ్లాక్ మార్కెటింగ్ వల్లనే యూరియా కొరత
రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక లోపం, బ్లాక్ మార్కెటింగ్ వల్లనే యూరియా కొరత నెలకొందని సంజయ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రాష్ట్రానికి సప్లై చేస్తే అందులో 9 లక్షలు మాత్రమే వినియోగించుకున్నారని, మిగతా యూరియా ఎక్కడ పోయిందని ఆయన ప్రశ్నించారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే పీఏ పేరుతో యూరియా పక్కదారి పట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయిందని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లుగా పంచాయతీలకు పైసా కూడా ఇవ్వలేదని సంజయ్ అన్నారు. అందుకే లోకల్ బాడీస్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం భయపడుతున్నదని ఆరోపించారు.
వచ్చే మార్చి నాటికి మావోయిస్టుల అంతం
2026 మార్చినాటికి దేశంలో మావోయిస్టులను అంతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బండి సంజయ్ అన్నారు. అమాయక ప్రజలను, పోలీసులను చంపుతూ మావోయిస్టులు కూడా చనిపోతున్నారని అన్నారు. వారు ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లీడర్లు రాగ్యా నాయక్, శ్రీపాదరావు, చిట్టెం నర్సిరెడ్డి లాంటి వాళ్లను మావోయిస్టులు ఎందుకు చంపారో వారిని సమర్థిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.