సీఎం కేసీఆర్​పై సంజయ్ ఫైర్

సీఎం కేసీఆర్​పై సంజయ్ ఫైర్
  • మత విద్వేషాలు రగిల్చి బీజేపీపై నెట్టే కుట్ర
  • సీఎం కేసీఆర్​పై సంజయ్ ఫైర్
  • మేం అభివృద్ధిపై మాట్లాడుతుంటే మతతత్వ పార్టీ అంటూ నిందలేస్తున్నరు
  • లిక్కర్ స్కాంపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆరోపణలు  


హుజూరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పాత్రపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ నుంచి దృష్టి మళ్లించేందుకు.. మత కల్లోలాలు సృష్టించి బీజేపీపై నెపం వేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ మండిపడ్డారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి ఇటీవల మరణించడంతో గురువారం హుజూరాబాద్​లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. తర్వాత ఈటల క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.‘‘పాదయాత్రలో ప్రజా సమస్యలపై, ఎనిమిదేండ్లలో కేంద్రం ఇచ్చిన నిధులపై మేం మాట్లాడుతుంటే.. కేసీఆర్ మాత్రం ఎంఐఎంతో కలిసి విద్వేషాలు రెచ్చగొడుతున్నడు. ఆ కుట్రలో భాగంగానే సీతమ్మ వారిని కించపరుస్తున్న మునావర్ ఫారూఖీ అనే కమెడీయన్​ను హైదరాబాద్ రప్పించి మత విద్వేషాలకు తెరదీశాడు” అని ఆరోపించారు. కేసీఆర్ కు దమ్ముంటే ఎనిమిదేండ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమమైన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రాజకీయ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. 

ఇప్పుడే ఎందుకు ఉద్రిక్తతలు

తాము అభివృద్ది గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అంటూ విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని సంజయ్ విమర్శించారు. బీజేపీని బద్నాం చేసేందుకు హైదరాబాద్ పాతబస్తీలో మత ఘర్షణలకు కుట్ర చేస్తున్నారని.. ఇందులో భాగంగానే  సీతమ్మను కించపరిచిన మునావర్ ఫారుఖీ అనే కమెడియన్ ను షోకు కేసీఆర్ అనుమతిచ్చారన్నారు. పాతబస్తీలో ఇప్పుడే ఎందుకు ఘర్షణలు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు. సీఎంగా ఉన్న వ్యక్తే రాష్ట్రంలో హింసకు కుట్ర చేస్తే ప్రజలు ఇంకెవరికి చెప్పుకోవాలన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని.. కేసీఆర్ కుట్రలకు బలికావొద్దన్నారు. 

అధికారిక కార్యక్రమంలో రాజకీయ విమర్శలా?

కలెక్టరేట్ల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ కేంద్రం, బీజేపీపై నోటికొచ్చిందల్లా మాట్లాడం తగదని సంజయ్ అన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఏం అభివృద్ధి చేసినవో చెప్పకుండా.. దేశ ప్రధానిపైన ఇష్టానుసారంగా మాట్లాడటమేంటని విమర్శించారు. ఎనిమిదేండ్లలో రంగారెడ్డి జిల్లాకు చేసిందేమిటో చెప్పాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో 20 శాతం కూడా పూర్తి కాలేదని అందుకు కారణం కేసీఆరే అన్నారు. ఆ ప్రాంతంలో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినవ్.. ఎంత మందికి పెన్షన్లు ఇచ్చినవ్.. రేషన్ కార్డులు ఇచ్చింది చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు వెల్లడించే దమ్ముందా అని ప్రశ్నించారు. 

పాదయాత్ర కొనసాగిస్తాం

పాదయాత్రను కొనసాగిస్తామని సంజయ్ చెప్పారు. ‘‘యాత్రను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసింది. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకంతో కోర్టును ఆశ్రయించాం. తీర్పు మాకు అనుకూలంగా రావడాన్ని స్వాగతిస్తున్నం. పాదయాత్రను వెంటనే ప్రారంభిస్తం. ఈ నెల 27న హన్మకొండలో ముగింపు సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా వస్తారు’’ అని సంజయ్​ చెప్పారు.