మోడీ సభకు 10 లక్షల మంది

మోడీ సభకు 10 లక్షల మంది

హైదరాబాద్ లో ప్రధాని మోడీ సభకు 10 లక్షల మంది హాజరవుతారని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ అన్నారు. జులై 3 సాయంత్రం 4 గంటలకు జరగనున్న బహిరంగ సభ కోసం భారీ  ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు వచ్చే నెల 2,3,4 తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉంటాయన్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు 300 మందికి పైగా ప్రతినిధులు సమావేశాలకు హాజరవుతారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిస్తే తప్పేంటని సంజయ్ ప్రశ్నించారు. ఈటల, అమిత్ షా భేటీపై అనవసర రాద్దాంతం చేయొద్దని, జాతీయ నేతలను కలిసే స్వేచ్ఛ తమ పార్టీలో అందరికీ ఉంటుందని స్పష్టం చేశారు. 

ఉదయం  HICC నోవాటెల్లో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు భేటీయై పలు అంశాలపై చర్చించారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,  సమావేశాల స్టీరింగ్ కమిటీ సభ్యులు మీటింగ్ లో పాల్గొన్నారు. జులై 2 , 3 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలపై నేతలు చర్చించారు. అంతకు ముందు HICC లో కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను నేతలు పరిశీలించారు. సమావేశాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇప్పటికే  వివిధ కమిటీలను వేసింది. జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు.. హైదరాబాద్ లో ప్రధాని మోడీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేయాలని నేతలు నిర్ణయించారు. 

సమావేశాల నిర్వహణ కోసం 50 వేల మంది నుంచి నిధి సేకరిస్తున్నట్లు సంజయ్ చెప్పారు. ఆల్ లైన్ లో మాత్రమే నిధి ఇవ్వాల్సి ఉంటుందన్నారు.  కార్యవర్గ సమావేశాలకు వచ్చే ప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు సమావేశాలకు వచ్చే ప్రతినిధులకు తెలంగాణ వంటకాలు రుచి చూపించనున్నారు. ఇప్పటికే వంటలకు ఆర్డర్ ఇచ్చారు. నోవాటెల్ సిబ్బందితో భేటీ అయిన నేతలు... వంటలపై మాట్లాడారు. మెనూలో ఉలువ చారు, దోసకాయ పప్పు, మామిడి కాయ తొక్కు, చిక్కుడుకాయ, ఆలు, తెలంగాణ పచ్చిపులుసుతో పాటు బక్షాలు, గర్జలు ఆర్డర్ ఇచ్చారు.