బండి సంజయ్ వరంగల్ వైపు తరలింపు.. పోలీసుల హైడ్రామా.. కారు అద్దాలకు పేపర్లు..

బండి సంజయ్ వరంగల్ వైపు తరలింపు.. పోలీసుల హైడ్రామా.. కారు అద్దాలకు పేపర్లు..

యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తరలింపులో హైడ్రామా నడిచింది. పోలీసులు హడావిడి చేశారు. పీఎస్ నుంచి కోర్టులో హాజరుపర్చటానికి తీసుకెళుతున్న సమయంలో.. కారు అద్దాలకు పేపర్లు అడ్డు పెట్టారు. కారులోని వ్యక్తులు  బయటకు కనిపించకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు.

భువనగిరి కోర్టులో హాజరుపరుస్తు్న్నామని లీకులు ఇచ్చి.. ఆ తర్వాత రోడ్డెక్కిన తర్వాత పోలీస్ వాహనాల కాన్వాయ్ వరంగల్ వైపు వెళ్లింది. బండి సంజయ్ వెంటే వెళ్లిన బీజేపీ శ్రేణులు సైతం ఈ పరిణామంతో షాక్ అయ్యారు. ఏప్రిల్ 4వ తేదీ రాత్రి కరీంనగర్ లో అరెస్ట్ చేసిన పోలీసులు.. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో ఆయన పాత్ర ఉందని ఆరోపిస్తూ.. ఆయనపై వరంగల్ లో కేసు ఫైల్ అయ్యింది.

బండి సంజయ్ ఏ కారులో ఉన్నారు అనేది తెలియకుండా.. ఆయన మీడియా కంట పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. మీడియా వాళ్లను దగ్గరకు రానీయకపోగా.. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉన్న వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, నేతలను అక్కడి నుంచి పంపించి వేశారు. ఎంపీ బండి సంజయ్ ఏ వాహనంలో ఉన్నారు అనేది ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు.

2023, ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో.. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్యేక కాన్వాయ్ బయలుదేరగా.. భువనగిరి కోర్టులో కాకుండా.. భువనగిరి దాటి.. వరంగల్ వైపు తరలిస్తు్న్నారు పోలీసులు.