యాదాద్రికి బండి సంజయ్​

యాదాద్రికి బండి సంజయ్​
  • కొనుగోళ్ల వ్యవహారంపై కేసీఆర్​కు సంజయ్ సవాల్​
  • దొరికిన డబ్బులు ఎక్కడికి పోయినయ్​?
  • ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలె
  • బైపోల్​లో ఓటమి భయంతో ఎన్నిక రద్దుకు కేసీఆర్ కుట్ర
  • అకారణంగా బీజేపీని బద్నాం చేస్తున్న సీపీ సంగతి చూస్తం
  • మునుగోడు బీజేపీ క్యాంప్ ఆఫీసులో టీఆర్ఎస్​పై చార్జ్ షీట్ రిలీజ్

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్​లో దొరికినట్లు చెప్తున్న డబ్బులను పోలీసులు మీడియాకు ఎందుకు చూపలేదని, అవి ఏమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ డబ్బులను ఎందుకు సీజ్ చేయలేదని, అందులో ఎంత సొమ్ము నొక్కేస్తున్నావ్ అని సైబరాబాద్ ​సీపీపై మండిపడ్డారు. అసలు ఆ బ్యాగులో ఏముందని, బాంబులేమైనా ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సీబీఐ విచారణ కూడా జరపాలని కోరారు. ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. గురువారం మునుగోడు బీజేపీ క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో మునుగోడు బైపోల్​ స్టీరింగ్ కమిటీ చైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి, ఎంపీ ధర్మపురి అర్వింద్​తో కలిసి సంజయ్ టీఆర్ఎస్ పై చార్జ్ షీట్​ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో జరిగిన హైడ్రామాపై మరోసారి ఘాటుగా స్పందించారు. 

సీపీ ఆధ్వర్యంలోనే డ్రామా

‘ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా వెనుక పెద్ద కుట్ర ఉంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి వద్దకు నేనొస్తున్నా.. కేసీఆర్ నీకు ఈ ఎపిసోడ్ తో సంబంధం లేదనుకుంటే రేపు అక్కడికి రావాలి. నాతోపాటు ప్రమాణం చేయాలి. రేపు ఉదయం 9 నుండి 10 గంటలకు యాదాద్రి వద్ద ఎదురు చూస్తా.’ అని సంజయ్ సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ అక్కడికి రాకుంటే డ్రామాకు డైరెక్షన్ కేసీఆర్ దేనని భావిస్తామన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామా అంతా జరిగిందని.. బీజేపీని అకారణంగా బద్నాం చేసేందుకు యత్నించిన సదరు పోలీస్ కమిషనర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నకల్ కొట్టడానికి కూడా అకల్ ఉండాలే.. కేసీఆర్ కు అది కూడా లేదని ఎద్దేవా చేశారు. ఒక్క ఉప ఎన్నిక గెలిచేందుకు ఇంత డ్రామా ఎందుకని ప్రశ్నించారు. మీడియా సైతం వాస్తవాలను బయటపెట్టాలని, దీనివెనుక ఉన్న కుట్రలను ఛేదించాలని కోరారు. కానీ దురదృష్టవశాత్తు రెండు, మూడు చానెళ్లు పాలకులతో కుమ్కక్కై అబద్ధాలను ప్రచారం చేయడం బాధాకరమన్నారు.

వాళ్లు టీఆర్​ఎస్​నేతల పార్ట్​నర్స్​

డబ్బులు ఆఫర్ చేసినవాళ్లు గాలిగొట్టం గాళ్లని, వాళ్లు టీఆర్ఎస్ నేతల వ్యాపార భాగస్వాములని సంజయ్ తెలిపారు. వారికి కేసీఆర్ కుటుంబంతోనూ వ్యాపార సంబంధాలున్నయని, ఈ లెక్కన వాళ్లు కూడా టీఆర్ఎస్​వాళ్లేనని స్పష్టం చేశారు. వెంటనే ఈ వ్యవహారానికి వేదికైన దక్కన్ కిచెన్ సెంటర్ సీసీ ఫుటేజీ బయటపెట్టాలని, ప్రగతి భవన్ కు గత వారం రోజులుగా ఎవరెవరు వస్తున్నారు? ఢిల్లీలో సీఎంను కలిసిన వారెవరు? పోలీస్ కమిషనర్, నలుగురు ఎమ్మెల్యేలు, సూత్రధారులు, పాత్రధారుల కాల్ లిస్టుతోపాటు సీఎం క్యాంపు ఆఫీస్ ల్యాండ్ లైన్ ఫోన్ లిస్ట్ కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం 11.26 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైతే.. సాయంత్రం వరకు అనుకూలమైన 2 చానెళ్లకే సమాచారం ఇవ్వడం వెనుక మర్మమేమిటని అనుమానం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఎమ్మెల్యేలను విచారించడానికి పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకెళ్లలేదని, వాళ్ల స్టేట్ మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదని ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షుడు డాక్టర్ మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, ఎన్వీ సుభాష్, జె.సంగప్ప తదితరులు పాల్గొన్నారు.

సంజయ్​ను అడ్డుకుంటమని టీఆర్ఎస్ హెచ్చరిక

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రజాస్వామ్య విలువలను భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ స్టేట్​చీఫ్ బండి సంజయ్, బీజేపీ లీడర్లను యాదగిరిగుట్ల రాకుండా అడ్డుకుంటామని ఆలేరు మార్కెట్​కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, యాదగిరి గుట్ట టీఆర్​ఎస్​అధ్యక్షుడు కర్రె వెంకటయ్య హెచ్చరించారు.

కేసీఆర్ తప్పిదాలపై చార్జీషీట్..
కేసీఆర్ మూర్ఖపు పాలన, అనాలోచిత నిర్ణయాలు, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ మునుగోడును పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని సంజయ్ అన్నారు. కేసీఆర్ పాలనలో చేసిన తప్పిదాలపై చార్జ్ షీట్ రూపొందించామని తెలిపారు.