జనగామ, వెలుగు: గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలతో పాటు పట్టణ ప్రాంతాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి దిశగా నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం రూరల్ ప్రాస్పరిటీ అండ్ రిసిలెన్స్ ప్రోగామ్ (ఆర్పీఆర్పీ) చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్‌గా ఐదు జిల్లాలను ఎంపిక చేయగా, దక్షిణ భారతదేశం నుంచి జనగామ జిల్లా ఒక్కటే ఎంపికైంది.
దీంతో కేంద్రం నియమించిన బృందం జిల్లా స్థితిగతులను ఐదు రోజుల పాటు పరిశీలించడానికి సోమవారం వచ్చింది. ఈ బృందంలోని ఎషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, బోష్టన్ కన్సల్టేన్సీ ప్రతినిధులు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ను కలిశారు. జిల్లా ఆవిర్భావం, భౌగోళిక పరిస్థితులు, అమలు చేస్తున్న ప్రభుత్వ స్కీమ్స్ గురించి ప్రతినిధులకు ఆయన వివరించారు.
అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల హయ్యర్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. జిల్లాలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య నెలకొన్న అభివృద్ధి అంతరం గురించి ఆరా తీశారు. వలసలు తగ్గించి, గ్రామీణ ప్రజల్లో ఆర్ధిక స్థిరత్వం పెంపెందించే దిశగా ఆర్పీఆర్పీ ప్రోగ్రామ్ నిర్వహిస్తోందని వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు కూడా తమ పరిధిలో కేంద్ర, రాష్ట్ర పథకాల అమలును వివరించారు. మీటింగ్‌లో అడిషనల్ కలెక్టర్ పింకేశ్‌కుమార్, ఎషియాన్ డెవలప్మెంట్ బ్యాంకు, బోష్టన్ ప్రతినిధులు, పలు డిపార్ట్మెంట్ల హయ్యర్ ఆఫీసర్లు ఉన్నారు.
ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్..
జనగామ అర్బన్: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, స్కోప్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథాన్ని సోమవారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రారంభించారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
