కేసీఆర్ రాజీనామాకు సిద్ధమా:బండి సంజయ్

కేసీఆర్ రాజీనామాకు సిద్ధమా:బండి సంజయ్

గ్రామ పంచాయతీలతో పాటు జాతీయ ఉపాధి హామీ నిధులను మళ్లించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో ఆధారాలతో సహా చర్చకు సిద్ధమని చెప్పారు. నిధుల గోల్ మాల్ జరిగిందని నిరూపిస్తే కేసీఆర్ రాజీనామాకు సిద్ధమా అని బండి సవాల్ విసిరారు.

ఢిల్లీ నుంచి గల్లీ దాకా కార్యకర్తలను అనుసంధానించడమే లక్ష్యంగా ‘‘సరళ్’’ యాప్ను ఆవిష్కరించామని బండి సంజయ్ చెప్పారు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.  పోలింగ్ బూత్ కమిటీల సమ్మేళనంలో భాగంగా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలింగ్ బూత్ కమిటీలో పార్టీకి మూలస్తంభాలని... వాటి ద్వారానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందని చెప్పారు.  కార్యకర్తల కష్టాన్ని నేరుగా జాతీయ నాయకత్వం గుర్తించేందుకు సరళ్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని సంజయ్ అభిప్రాయపడ్డారు. 

రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ కేంద్ర నిధుల విషయంలో డ్రామాలాడుతోందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల కష్టం వల్లే దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి దాకా 22 నోటిఫికేషన్లు ఇచ్చింది తప్ప ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని బండి అన్నారు. 1,91,000 ఉద్యోగ ఖాళీలున్నప్పటికీ నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఒక్కరోజే 75 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఘనత నరేంద్రమోడీ ప్రభుత్వానిదన్నారు.