మౌలాలిలో ప్రజా సంగ్రామ యాత్రకు స్పందన

మౌలాలిలో ప్రజా సంగ్రామ యాత్రకు స్పందన

మౌలాలి: ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భవిష్యత్ పై భరోసాను ఇస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర మౌలాలికి చేరుకుంది. ఈసందర్భంగా మౌలాలిలోని మనీషా గార్డెన్స్ లో గంగపుత్రులు ఆయనను కలిశారు. తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. కులవృత్తులను కేసీఆర్ సర్కారు నిర్వీర్యం చేసిందని బండి సంజయ్ తో గంగపుత్రులు అన్నారు. గంగపుత్రుల పొట్ట కొట్టేందుకు కేసీఆర్ సర్కార్ జీవో నంబర్ 6 ను తెచ్చిందన్నారు. జీవో నెంబర్ 6 ను వెంటనే రద్దు చేయాలని గంగపుత్రులు డిమాండ్ చేశారు. చేపలు పట్టే వృత్తి గంగపుత్రులకే హక్కుగా ఉండాలన్నారు.గంగపుత్రులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని గంగపుత్రులు పేర్కొన్నారు. వాజ్ పేయి కేంద్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే ఎస్టీ జాబితాలో గంగపుత్రులను చేర్చాలని బండి సంజయ్ కు విజ్ఞప్తి చేశారు. గంగపుత్రుల సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తానని బండి సంజయ్ ఈసందర్భంగా హామీ ఇచ్చారు. అన్ని కులాలు, అన్ని వర్గాలలోని అర్హులకు బీజేపీ తప్పక న్యాయం చేస్తుందన్నారు. 

'గౌడ్ శెట్టి బలిజ వెల్ఫేర్ అసోసియేషన్' వినతిపత్రం

మౌలాలి  మనీషా గార్డెన్స్ లోనే జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని 'గౌడ్ శెట్టి బలిజ వెల్ఫేర్ అసోసియేషన్' ప్రతినిధుల బృందం కలిసింది. తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత..  2014లో జీవో నెంబర్ 3 ప్రకారం శెట్టి బలిజ కులాన్ని బీసీ జాబితా నుంచి తొలగించి కేసీఆర్ సర్కారు  అన్యాయం చేసిందన్నారు. మమ్మల్ని మీరే ఆదుకోవాలని  బండి సంజయ్ కు విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ కులాన్ని బీసీ జాబితాలో చేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గౌడ్ శెట్టిబలిజ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం కోరింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని బండి సంజయ్ చెప్పారు.