రైతుల తిప్పలు తీర్చేదెప్పుడు?..సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ

రైతుల తిప్పలు తీర్చేదెప్పుడు?..సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
  • సొంత మేనిఫెస్టోపై మంత్రి తుమ్మలకు సోయి లేదని విమర్శ

కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్​మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఎప్పుడు అమలవుతాయని, రైతుల సమస్యలు ఎప్పుడు తీరుతాయని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి.. ఇప్పుడు కేంద్రంపై నెపం నెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఆదివారం రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్​రెడ్డికి లేఖ రాశారు.  ఎమ్మెస్పీ చట్టం తెస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్సేనని, సొంత పార్టీ మేనిఫెస్టోలో ఏం రాశారో కూడా తెలుసుకోలేని అసమర్థుడు తుమ్మల అని విమర్శించారు.

‘‘ధర నిర్ణయాధికారం కేంద్రానిదైతే.. దాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్రానిదన్న కనీస సోయి లేదా?" అని ప్రశ్నించారు. ఫసల్ బీమా యోజనను కావాలనే పక్కనబెట్టి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని, గడిచిన రెండేళ్లలో కొత్త బీమా పథకం ఎందుకు తేలేకపోయారో చెప్పాలని అడిగారు.  కేంద్రం ఏటా ఎస్డీఆర్ఎఫ్ కింద రూ.400 కోట్లు ఇస్తుంటే ఆ డబ్బులు ఏం చేస్తున్నారో చెప్పగలరా.. అంటూ సవాల్ విసిరారు.

5 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే.. ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.5 వేల కోట్లు ఇవ్వాల్సింది పోయి, కేవలం రూ.250 కోట్లతో చేతులు దులుపుకుందని ఫైర్​అయ్యారు. 12 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. గోనె సంచుల నుంచి వడ్ల కొనుగోలు దాకా ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందని, ఇప్పటికైనా మంత్రులకు అవగాహన కల్పించాలని సీఎంను కోరారు.