కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆరోపణలు: ప్రెస్ నోట్ విడుదల చేసిన బండి సంజయ్

కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆరోపణలు: ప్రెస్ నోట్ విడుదల చేసిన బండి సంజయ్

కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఎం కేసీఆర్ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. కేంద్ర ప్రభుత్వ ఉద్దీపనలు ఫ్యూడల్‌ విధానంలో ఉన్నాయని కేసీఆర్ అంటున్నారని… భూస్వామ్య విధానం గురించి, ఫ్యూడల్ స్వభావం గురించి ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.దీనికి సంబంధించి ప్రెస్ నోట్ ను విడుదల చేశారు బండి సంజయ్. తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకుల్లో కూడా అత్యంత ప్రజాస్వామిక దృష్టితో ప్రధాని మోడీ ప్రకటించిన ప్యాకేజీ ఎంత ఉపయోగకరమో….ప్రజలు రాబోయే రోజుల్లో తెలుసుకుంటారన్నారు.ఇంతకాలం కాంగ్రెస్ హాయాంలో విదేశీ అనుకూల విధానాలే అమలవుతూ వచ్చాయి తప్ప దేశీయ విధానాలు అమలు కాలేదన్నారు.

నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణల సందర్భంలో కేసీఆర్… మోడీని పొగిడినంతగా స్వయంగా బీజేపీ శ్రేణులు కూడా ఆ స్థాయిలో స్పందించలేదని తెలిపారు. ఇంకా ప్రెస్ నోట్ లో ప్రస్తావించిన అంశాలు….

 ప్రతి 2500 కోట్లకు ఒక సంస్కరణను ఆంక్షగా పెట్టారు..

రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని కేసీఆర్ అన్నారు. అంటే కేంద్రం నేరుగా నగదు ఇస్తే తమ జేబులు నింపుకుందామనా? అభివృద్ధి పనుల పేరుతో కమీషన్లు దండుకుందామనా? గతంలో ఇదంతా జరిగిందేమో….మోడీ సర్కార్ హాయాంలో ఇది సాధ్యం కాదు.‘‘మై నై ఖావుంగా…న ఖానేదూంగా’ అన్నమోడీ అదే మాటను ఆచరిస్తున్నారు. ఆర్థికవ్యవస్థకు భారతీయ రిజర్వు బ్యాంక్‌, కేంద్రప్రభుత్వం రెండు కళ్ళు. ఆర్‌బీఐ ద్రవ్య విధాన సూత్రీకరణతో వ్యవహరిస్తుంది. రాష్ట్రాలకు నేరుగా నగదు అందించడం అన్న అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019, మార్చిలో కొత్త నిబంధనలు ఉండాలని ప్రతిపాదించింది. కొన్ని నియమాల ఆధారంగా రుణాలు ఇచ్చే పద్ధతి ఉండాలని అంటే Ways and Means లో రాష్ట్ర ప్రభుత్వాలకు పరిమితులు విధించాలని సూచించింది. ఇది గతంలో వ్యయ ఆధారిత రుణాలు మంజూరు చేసేది. దీన్ని నివారించాలని కేంద్రానికి సూచించింది. ఆర్బీఐ సూచనలను అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక శాఖ కార్యదర్శులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ నేరుగా వివరించారు.

వారు అంగీకరించారు…

ఇప్పుడు ఆంక్షలు పెడితే ఎలా అంటున్నారు కేసీఆర్. అంగీకరించినప్పుడు ఇంగితం ఏమైంది? ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లకు నిబంధనలు పెట్టారు. దీన్ని కేసీఆర్ పంచాయితీల, మున్సిపాలిటీలు పన్నులు పెంచితే ఇస్తామన్నారు‘ అంటూ వ్యాఖ్యానించారు. పన్నులు పెంచమని కేంద్రం చెప్పలేదు. సౌకర్యాల కల్పన వల్ల సహజంగానే పన్నుల రాబడి పెరుగుతుందని చెప్పింది. దీనికి వక్రభాష్యం చెప్పారు కేసీఆర్.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధికంగా వెసులుబాటు ఇచ్చేందుకు కేంద్రం తాజా ఉద్దీపన ప్యాకేజీలో కొన్ని మినహాయింపులు ప్రకటించింది. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ జీఎస్డీపీలో 3 శాతం వరకూ మాత్రమే రుణాలు తీసుకునే అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ చేయగలిగితే 3.5 శాతం వరకూ అవకాశం ఉండేది. అంతకు మించి రూపాయి కూడా అప్పు చేయడానికి వీల్లేదు. కానీ తాజాగా కేంద్రం దాన్ని 5 శాతానికి పెంచింది. రాష్ట్రాల రుణ పరిమితిని పెంచాలంటే అవి కొన్ని షరతులు పాటించాలని కేంద్రం చెప్పింది. అందులో వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్ సంస్కరణలు, పట్టణ స్ధానిక సంస్ధల ఆదాయాల క్రమబద్ధీకరణ చేపట్టాల్సి ఉంటుంది.

ఎఫ్.ఆర్.బీ.ఎం పెంచడంపై కేసీఆర్ అసంబద్ధమైన ఆరోపణలు చేశారు..

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఇబ్బముబ్బడిగా రుణాలు తీసుకుని ప్రజలపై భారం మోపకుండా ఉండేందుకు ఎఫ్.ఆర్.బీ.ఏం( ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్ యాక్ట్) ఒక పరిమితిని విధించింది. అందుకే ఎఫ్ ఆర్ బీఎం విషయంలో ఖచ్చితంగా వ్యవహరిస్తోంది. అయినా ..మేము 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాం… నువ్వెన్ని కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తున్నావో చెప్పు. కరోనాను ఎదుర్కోవడంలో ఒకవైపు ప్రధాని మోడీ ఆద్భుతంగా ప్రజల ఆదరణను చూరగొంటుంటే, ఇంకోవైపు కేసీఆర్ ప్రజల చీత్కారానికి గురవుతున్నారు.

కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తే తలింతా పంచుకుందామని కొందరు రాబందుల్లా ఎదురుచూస్తున్నారు. ఏమైనా అంటే రైతు బంధు ఇస్తున్నా అంటున్నాడు. వ్యవసాయంలో రైతు బంధు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇంకేమైనా ఉందా? పదిహేను రోజుల్లో జీతాలకు కొత విధించిన నీకు కేంద్రాన్ని విమర్శించే హక్కు ఎక్కడిది? కేసీఆర్  ఓటు బ్యాంక్ రాజకీయాలకు కేంద్రం డబ్బులు ఇవ్వాలా? అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు బండి సంజయ్.