భజరంగ్ దళ్ నిషేధానికి కేసీఆర్ కుట్ర.. హిందువులు ఏకం కావాలి..

భజరంగ్ దళ్ నిషేధానికి కేసీఆర్ కుట్ర.. హిందువులు ఏకం కావాలి..

తెలంగాణలో భజరంగ్‌దళ్‌ను నిషేధించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో జరిగిన  బీజేపీ ఓబీసీ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన భజరంగ్‌దళ్‌ను నిషేధించడంలో కేసీఆర్ .. కాంగ్రెస్‌తో  పోటీ పడుతున్నారని మండిపడ్డారు. భజరంగ్ దళ్ ఎవరిని రెచ్చగొట్టలేదన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకే భజరంగ్ దళ్ ప్రయత్నం చేస్తోందన్నారు. కేసీఆర్ కుట్రను తిప్పికొట్టటానికి హిందువులంతా ఏకంకావాలని బండి సంజయ్  పిలుపునిచ్చారు.

కేసీఆర్కు ఏంటీ ఇబ్బంది..

దళిత బంధును ప్రకటించిన కేసీఆర్..బీసీ బంధును ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. బీసీబంధు ప్రకటించటానికి ఇబ్బంది ఏంటో సీఎం కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇవ్వటం‌ వెనుక కుట్ర దాగుందన్నారు.  హైదరాబాద్ లో త్వరలో  లక్షల మందితో బీసీ శంఖారావ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో రామ రాజ్యం రావడానికి ఇంకా 5 నెలలే టైముందని..అందుకోసం బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ క్యాబినెట్‌లో ముగ్గురు మాత్రమే బీసీ మంత్రులున్నారని చెప్పారు. కానీ  కేసీఆర్ కుటుంబానికి మాత్రం నాలుగు మంత్రి పదవులా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించి బీసీల పొట్టకొట్టిందని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడిన  ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించిన మూర్ఖుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీసీల ఆత్మగౌరవ భవనం ఏది..

తన కోసం..తన కొడుకు కోసం రూ.1600 కోట్లతో కొత్త  సచివాలయాన్ని నిర్మించిన కేసీఆర్.....బీసీల ఆత్మగౌరవ భవనం ఎందుకు నిర్మించటం‌లేదని ప్రశ్నించారు. దళితబంధు పథకంలో 30 శాతం కమిషన్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని కేసీఆరే ఆరోపించారని..మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో  చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని..కానీ బీజేపీ మాత్రం వెనుకబడిన వర్గాలకు చెందిన తనకు రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఏ మాత్రం ఉండదని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వస్తుందని దీమా వ్యక్తం చేశారు. 

 

బీజేపీ బీసీ డిక్లరేషన్..

  • తెలంగాణ అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్‌లో కేటాయింపులు
  •  రాష్ట్ర బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించి అన్ని అధికారాలు అప్పగిస్తాంః
  • విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులందరికీ పరిమితి లేకుండా స్టాచ్చురేషన్ పద్దతిలో అందరికీ ఆర్థిక సాయం 
  • నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్ద పీట, ఎన్నికల్లో పోటీపడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత