రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించండి: బండిసంజయ్

రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించండి: బండిసంజయ్
  • బకాయిలు ఇవ్వకపోతే దీక్ష చేస్తా: బండి సంజయ్
  • 7 లక్షల మందికిపైగా ఉద్యోగులకు 
  • 5 డీఏలను పెండింగ్‌‌లో పెట్టింది
  • రెండున్నరేండ్లుగా పీఆర్సీ ఊసే లేదు
  • ఉద్యోగులపై ప్రభుత్వానిది నిర్లక్ష్య వైఖరి అని మండిపాటు
  • సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ 

కరీంనగర్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకపోవడం న్యాయమా అని మంగళవారం సీఎంకు రాసిన బహిరంగ లేఖలో ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, రిటైర్డ్ ఉద్యోగుల వెతలను మీ దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నాను. 

రాష్ట్రంలో 3 లక్షల మందికిపైగా రెగ్యులర్ ఉద్యోగులు, 4 లక్షల మందికిపైగా రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 5 డీఏలను పెండింగ్‌లో పెట్టింది. ఉద్యోగులు దాచుకున్న గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలను కూడా చెల్లించడం లేదు. 2023 జులై నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని రెండున్నరేండ్లు అవుతున్నా ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయం. కనీసం పీఆర్సీ రిపోర్ట్‌ను కూడా తెప్పించకపోవడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఉందో అర్థం చేసుకోవచ్చు. రిటైర్డ్ ఉద్యోగుల చావులకు మీ బాధ్యత లేదా? ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ప్రాధాన్యత లేని కేటగిరీగా భావిస్తున్నారా?’’అని ప్రశ్నించారు. బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం దిగిరాకపోతే హైదరాబాద్ నడిబొడ్డున దీక్ష చేసేందుకూ వెనుకాడబోనని ఆయన హెచ్చరించారు.