తెలంగాణలో డబుల్‍ ఇంజిన్‍ సర్కారే మన టార్గెట్..సుష్మాస్వరాజ్‍ కృషితోనే  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం: : నితిన్ నబీన్‌‌‌‌

తెలంగాణలో డబుల్‍ ఇంజిన్‍ సర్కారే మన టార్గెట్..సుష్మాస్వరాజ్‍ కృషితోనే  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం: : నితిన్ నబీన్‌‌‌‌
  • కుటుంబ పాలనతో స్వరాష్ట్ర ఆశయాలు నెరవేరలే
  • కాంగ్రెస్‍ నేత రాహుల్‍గాంధీ పార్ట్​టైం పొలిటీషియన్‍
  • గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ ఎన్నికలు మనకు సెమీ ఫైనల్‌‌‌‌ 
  • ఇక్కడ కాషాయ జెండా ఎగరేయాలని కేడర్‌‌‌‌‌‌‌‌కు పిలుపు 
  • వరంగల్‌‌‌‌ బూత్‌‌‌‌ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనానికి హాజరు

వరంగల్‍/ హనుమకొండ, వెలుగు: తెలంగాణలో డబుల్‍ ఇంజిన్‍ సర్కార్‍ ఏర్పాటే తమ లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‍ నబీన్‍ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీనే నిజమైన ప్రత్యామ్నాయమని అన్నారు. సోమవారం గ్రేటర్‍ వరంగల్‌‌‌‌లో నితిన్‌‌‌‌ నబీన్‌‌‌‌ పర్యటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‍రావు, కేంద్ర మంత్రులు కిషన్‍రెడ్డి, బండి సంజయ్‍, పార్టీ ఓబీసీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‍ తదితరులతో కలిసి ఉమ్మడి జిల్లా పార్టీ బూత్‍ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్నారు.  అనంతరం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్​అండ్‍ సైన్స్​కాలేజీలో నిర్వహించిన సభలో నితిన్‍ నబీన్‍ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ నేత సుష్మా స్వరాజ్‍ కీలక పాత్ర పోషించారని, ఆమె కృషివల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఎందరో బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో.. కుటుంబ పాలనవల్ల స్వరాష్ట్ర ఆశయాలు నెరవేరలేదని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ కొత్త పార్టీ అని కొందరు మాట్లాడుతున్నారని, కానీ 1980లో దేశంలో బీజేపీ రెండు ఎంపీ స్థానాలు గెలిస్తే అందులో ఒకటి తెలంగాణ ప్రాంతంనుంచే ఇచ్చారని పేర్కొన్నారు. బీజేపీకి తెలంగాణ ప్రాంతంలో కేవలం రాజకీయ బంధం మాత్రమే కాదని.. పోరాటాలు, ప్రజల విశ్వాసంతో ఏర్పడిన బంధం ఉన్నట్టు పేర్కొన్నారు. సర్ధార్‍ వల్లబాయ్‍ పటేల్‍ దృఢ సంకల్పంవల్లే హైదరాబాద్‍, తెలంగాణ ప్రాంతం దేశంలో అంతర్భాగంగా నిలిచాయని చెప్పారు. 

మాజీ ప్రధాని పీవీని అవమానించిన పార్టీ కాంగ్రెస్‍ 

మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్‍ పార్టీ అవమానించిందని, ఆయన చనిపోయినప్పుడు కనీస గౌరవం ఇవ్వలేదని నితిన్‍ నబీన్‍ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పీవీకి భారత రత్న ఇచ్చి గౌరవించిందని చెప్పారు. రాహుల్​ గాంధీ కేవలం ఎలక్షన్ల టైమ్‌‌‌‌లో కనిపించే పార్ట్​ టైం పొలిటీషియన్‍ అని వ్యాఖ్యానించారు. బీఆర్‍ఎస్‍ కుటుంబ పాలన, అవినీతిపై బీజేపీ కార్యక్తరలు నిరంతర పోరాడారని పేర్కొన్నారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్‍ ఎన్నో హామీలిచ్చిందని, గెలిచిన తర్వాత ప్రజా సమస్యలనే మరిచిపోయిందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‍ ప్రభుత్వం ఢిల్లీలోని ఆ పార్టీ అధిష్టానానికి ఏటీఎంలా పని చేస్తోందన్నారు. 2 లక్షల ఉద్యోగాలిస్తామని యువతను మోసం చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రచారం చేయాలని కార్యకర్తలను కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ ‘సబ్‍ కా సాథ్‍.. సబ్‍ కా వికాస్‍..సబ్‍ కా ప్రయాస్‍’ అనే సిద్ధాంతంతో 2047 నాటికి వికసిత్‍ భారత్‍ నిర్మాణం దిశగా ముందుకుసాగుతోందని తెలిపారు. 

అభివృద్ధి కోసమే మావోయిస్టుల​ ఏరివేత 

దేశంలోని ఆదివాసీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారని, ఈ క్రమంలోనే దేశంలో నక్సల్‍ ఏరివేత చేపట్టామని నితిన్‍ నబీన్‍ పేర్కొన్నారు. చత్తీస్‍గఢ్‍, జార్ఖండ్‍ రాష్ట్రాల్లో నక్సల్​సమస్యను రూపుమాపామని..త్వరలోనే బస్తర్‍ ప్రాంతంలోనూ మావోయిస్టుల సమస్య తీరనుందని చెప్పారు. హనుమకొండలో గిరిజన నేతలతో మాట్లాడుతూ.. మావోయిస్టులు ఉన్నచోట ఇంతకాలం ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం గతంలోని కేంద్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని, బీజేపీ మాత్రం ఇప్పటికే రూ.15 వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. దేశంలోని అత్యున్నత రాష్ట్రపతి పదవిని ఆదివాసీ మహిళకు ఇచ్చి గౌరవించిందని తెలిపారు.  
కాషాయ జెండా ఎగరాలి..
గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‍గా భావించాలని కేడర్‍కు నితిన్‍ నబీన్‌‌‌‌ సూచించారు. గ్రేటర్‍ వరంగల్‍ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయాలని అన్నారు. వరంగల్‍ సిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల నిధులు ఇచ్చిందని చెప్పారు. కాజీపేట కోచ్‍ ఫ్యాక్టరీతో స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తున్నాయన్నారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ, వరంగల్‍ అధ్యక్షులు కొలను సంతోష్‍రెడ్డి, గంట రవికుమార్‍తోపాటు నేతలు తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్, రేవంత్‌‌‌‌ ఎంత ఎగిరిపడినా వచ్చేది 
బీజేపీ ప్రభుత్వమే: కిషన్ రెడ్డి

కేసీఆర్, రేవంత్‌‌‌‌రెడ్డి ఎంత ఎగిరిపడినా తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చాయని విమర్శించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని కేసీఆర్, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రాద్ధాంతం చేస్తున్నారని, 13 ఏండ్లుగా మోదీ వేల కోట్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కారుకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు. కేంద్రం నుంచి వరంగల్ అభివృద్ధికి ఇప్పటికే 17 వేల కోట్లకుపైగా ఇచ్చామని, రైల్వే స్టేషన్ల డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌తోపాటు రైల్వే లైన్లు, కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్ టైల్ పార్క్, స్మార్ట్ సిటీ, హృదయ్ పథకాలతో డెవలప్ చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది ప్రధాని మోదీ చేతులమీదుగా ఎయిర్ పోర్టు పనులు  ప్రారంభిస్తామన్నారు.  

వరంగల్ అంటేనే బీజేపీ అడ్డా: రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు

వరంగల్ అంటేనే బీజేపీ అడ్డా అని, జీడబ్ల్యూఎంసీలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే రామప్ప టెంపుల్‌‌‌‌కు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చామని, వరంగల్ కార్పొరేషన్ లో వెయ్యికోట్లకుపైగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తమ నెక్స్ట్ టార్గెట్ వరంగల్ మేయర్ స్థానమే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. 2028 ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తామని తెలిపారు.  బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌‌‌ను కాదని ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.