- హరీశ్‌వి అవగాహన లేని మాటలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
- సింగరేణిని ఆర్థికంగా వాడుకొని కార్మికులను కేసీఆర్ ముంచారని ఫైర్
- రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్
- సర్‌పై అప్రమత్తంగా ఉండాలని బీఎల్‌ఏలకు మంత్రి సూచన
కోల్‌బెల్ట్/ జైపూర్/కోటపల్లి, వెలుగు: సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీశ్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. రెండేండ్లలో బొగ్గు అమ్మకాల ద్వారా సింగరేణికి రూ.11 వేల కోట్ల లాభాలు వచ్చాయని, బొగ్గు మాయమైతే లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. గతంలో శ్రీరాంపూర్ నస్పూర్ సభలో సొంతింటి కల, కొత్త బొగ్గు గనులు, మారుపేర్ల సవరణ, ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు చేస్తామని కార్మికులకు మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదని గుర్తుచేశారు. కేసీఆర్, బీఆర్‌ఎస్ లీడర్లు సింగరేణి సొమ్ము వాడుకొని కార్మికులను నిండా ముంచారని ఆరోపించారు. కేసీఆర్ పదేండ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని, అంత అప్పు ఎందుకు చేశారో హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లీడర్లు ఇసుక, భూకబ్జాలు, దొడ్డు బియ్యం దందాలతో కాలం గడిపారని, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి, భీమారం, జైపూర్, చెన్నూరు మండలాల్లో మంత్రి పర్యటించారు.
మందమర్రిలోని బీ1ఆఫీస్, క్యాతనపల్లి, భీమారం, చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ)కు సర్‌పై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని, పలు సూచనలు చేశారు. అంతకు ముందు మందమర్రిలోని సింగరేణి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో టామ్‌కామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్మనీ భాషా ట్రైనింగ్ క్యాంపును సందర్శించారు. పలువురు యువతీ యువకులు జర్మనీ భాషలో మాట్లాడటంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ, ఓడిపోయిన ఫ్రస్టేషన్‌లో బీఆర్‌ఎస్ లీడర్లు సింగరేణి కార్మికులను మభ్యపెట్టడానికి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం కట్టి కమీషన్లు దండుకున్నారని, రూ.లక్ష కోట్లతో కట్టిన ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ ప్రయోజనం కలగలేదన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకిచ్చిన ఒక్క హామీ కూడా ఆయన నేరవేర్చలేదని ఆరోపించారు. మంత్రి వెంట మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి, రాష్ట్ర నేతలు సరోత్తంరెడ్డి, బండి సదానందం యాదవ్, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, జనరల్ సెక్రటరీ, సెక్రటరీలు పుల్లూరి లక్ష్మణ్, మహంకాళీ శ్రీనివాస్, గోపతి బానేశ్, ఎస్సీ సెల్ చైర్మన్ నర్సింగ్, నాయకులు ఉన్నారు.
సర్ ప్రక్రియపై నిర్లక్ష్యం వద్దు..
సర్ ప్రక్రియలో అలసత్వానికి తావివ్వొద్దని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును కాపాడేందుకు బీఎల్ఏలు బాధ్యతగా పనిచేయాలని మంత్రి వివేక్ సూచించారు. బీఎల్‌ఏలు ప్రతి ఇంటిని వెళ్లి ప్రతి కుటుంబంతో మాట్లాడాలని, అర్హులైన ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చూడాలన్నారు. మరోవైపు, జర్మనీ భాష నేర్చుకునేందుకు యువత ఆసక్తి చూపుతుందని అన్నారు. పట్టుదలతో శిక్షణ పూర్తి చేస్తే ఆ దేశంలో ఉద్యోగం గ్యారంటీ అని తెలిపారు. జర్మన్‌లో 5 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ జర్మన్ నేర్చుకున్న వారు ఉద్యోగాలు దక్కించుకుంటే రాష్ట్రానికి మందమర్రి రోల్ మోడల్‌గా మారుతుందని చెప్పారు.
