- ఆధార్ నంబర్ తో రోగి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్
- పేషెంట్ కు మందులు ఇవ్వగానే -ఔషధి యాప్ లో అప్ డేట్
- ఈజీ కానున్న స్టాక్ పర్యవేక్షణ
హైదరాబాద్, వెలుగు :ప్రభుత్వ హాస్పిటల్స్ లో మందుల కొరతకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు హాస్పిటల్స్ కు మందుల సరఫరా జరిగే వరకు మాత్రమే 'ఈ ఔషధీ' ద్వారా నిఘా ఉండేది. రోగులకు ఎంత మేర పంపిణీ అవుతున్నాయన్న వివరాలు రిజిస్టర్లకే పరిమితం అవుతుండడంతో అసలు మందుల నిల్వలపై స్పష్టత ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రోగుల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కోసం రూపొందించిన 'ఈ ఆరోగ్యం' యాప్ కు మందుల సప్లై కోసం రూపొందించిన 'ఈ ఔషధి' పోర్టల్ ను అనుసంధానించేందుకు వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ఆన్ లైన్ వ్యవస్థలను అనుసంధానించి.. మందుల పంపిణీలో పారదర్శకత తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద సంగారెడ్డి జిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైలింగ్ కొనసాగుతోంది.
ప్రతి ట్యాబ్లెట్ పై నిఘా
కొత్త విధానంలో రోగి ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. డాక్టర్ తన ట్యాబ్ లో రాసిన ప్రిస్క్రిప్షన్ వివరాలు వెంటనే ఫార్మసిస్ట్ స్క్రీన్ పై ప్రత్యక్షం అవుతాయి. ఫార్మాసిస్ట్ రోగికి మందులు అందించిన తర్వాత సిస్టమ్ లో ఓకే చేయగానే, ఆ మందుల వివరాలు ఈ– ఆరోగ్యం యాప్ నుంచి ఈ- –ఔషధి పోర్టల్ లో అప్ డేట్ అయి, ఆ మేరకు స్టాక్ తగ్గిపోతుంది. దీనివల్ల ప్రతి మందు బిళ్లకు సంబంధించిన లెక్క పక్కాగా ఆన్ లైన్ లో నిక్షిప్తం అవుతుంది. ప్రస్తుతం స్టాక్ మొత్తం అయిపోయే వరకు పై స్థాయి ఆఫీసర్లకు సమాచారం అందడం లేదు.
ఈ రియల్ టైమ్ డేటా అందుబాటులో వస్తే మందులు పక్కదారి పట్టే అవకాశమే ఉండదని ఆఫీసర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ డిజిటల్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలంటే ప్రతి హాస్పిటల్ లో డెడికేటెడ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
స్టాక్ పై ముందస్తు అలర్ట్
ఈ సాఫ్ట్ వేర్ అనుసంధానం కేవలం స్టాక్ ను పర్యవేక్షించడమే కాకుండా.. భవిష్యత్ అవసరాలను కూడా ముందే పసిగడుతుంది. హాస్పిటల్ లో మందుల స్టాక్ ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే తగ్గగానే ఆటోమేటిక్ గా అలర్ట్ చేస్తుంది. దీనివల్ల మందులు పూర్తిగా అయిపోకముందే కొత్త స్టాక్ తెప్పించే వెసులుబాటు కలుగుతుంది. అంతేకాకుండా, ఏ ప్రాంతంలో ఏయే వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి, ఏ రకమైన మందులకు డిమాండ్ పెరుగుతోందన్న డేటాను సైతం విశ్లేషించి భవిష్యత్ ప్రణాళికలు వేయడం ప్రభుత్వానికి ఈజీ అవుతుంది.
ప్రస్తుతం మందుల వివరాలు రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. దీంతో ఏయే మందులు ఎంత స్టాక్ ఉందనేది.. పై అధికారులకు రెగ్యులర్ గా తెలియడం లేదు. కొన్నిసార్లు హాస్పిటల్ సిబ్బంది స్టాక్ పూర్తిగా అయిపోయేదాక ఇండెంట్ పెట్టట్లేదు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు.. ప్రభుత్వం యాప్ అనుసంధానం నిర్ణయం తీసుకుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే... గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిరంతర పర్యవేక్షణ సాధ్యమై పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
