బీఆర్ఎస్సే.. దాడులకు కేరాఫ్! : బండి సంజయ్

బీఆర్ఎస్సే.. దాడులకు  కేరాఫ్! : బండి సంజయ్
  •     మా కార్యకర్తలు దాడులను ప్రోత్సహించరు: బండి సంజయ్
  •     ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రెస్​మీట్ ​పెట్టి బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్ట్?
  •     బీఆర్ఎస్ చేసిన అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని ధ్వజం

పద్మారావునగర్, వెలుగు: అరాచకాలు, దాడులకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీయేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేసి, ఇప్పుడు ఏమీ తెలియనట్టు సుద్దపూసల్లా మాట్లాడితే సరిపోదని ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలు ఎప్పుడూ దాడులను ప్రోత్సహించరని.. అయితే, వారి సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని ఆయన హెచ్చరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సురభి గార్డెన్స్‌‌లో గురువారం జరిగిన మహంకాళి జిల్లా బీజేపీ నాయకుల సమావేశంలో సంజయ్​పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌‌లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేయాలనే ఆలోచన తమ పార్టీ కార్యకర్తలకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ చేసిన అరాచకాలను రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని బండి సంజయ్ గుర్తుచేశారు. కేటీఆర్ సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ప్రతిసారీ బీజేపీ కార్యకర్తలను హింసించిన తీరును ఆయన తప్పుబట్టారు. గతంలో తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ కార్యకర్తలపై రాళ్ల దాడులు చేయించింది ఎవరో అందరికీ తెలుసన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వెళ్లినప్పుడు తమపై కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారని, మహిళా కార్యకర్తలను, రైతులను సైతం లెక్కచేయకుండా బీఆర్ఎస్ గూండాలు ప్రవర్తించారని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, హద్దుల్లో ఉండి హుందాగా వ్యవహరిస్తేనే అందరికీ మంచిదని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా బూతులు తిట్టడం మానుకోవాలని, లేనిపక్షంలో కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.


జై శ్రీరామ్ నినాదాలతోనే నిధులొస్తున్నయ్

జై శ్రీరాం, జై తెలంగాణ నినాదాలతోనే ఢిల్లీ నుంచి నిధులు వస్తున్నాయని, ఈ నినాదాల వల్లే ప్రధాని మోదీ రూ. 8,500 కోట్ల అభివృద్ధి పనులను రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు. హిందీ మాట్లాడే మోదీ గత 12 ఏండ్లలో తెలంగాణ కోసం రూ. 12 లక్షల కోట్లకు పైగా వెచ్చించారని.. తెలుగు మాట్లాడే రేవంత్ రెడ్డి మాత్రం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రం పరువు తీస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజర్ కాదని, ఆయన ఒక 'తెలంగాణ లూటర్' అని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సొమ్మును ఢిల్లీలోని పెద్దలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కేరళలో రెండు సభల్లో పాల్గొన్నంత మాత్రాన రేవంత్ రెడ్డే గెలిపించారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు రాహుల్ గాంధీ సీట్లో కూర్చోవాలా అని తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బెంగాల్ స్ఫూర్తితో తెలంగాణలోనూ పోరాడి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 10న జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను  సక్సెస్ చేయాలని, హైదరాబాద్ బీజేపీ కార్యకర్తలు 'షో పుటప్' రాజకీయాలు పక్కనపెట్టి తమ సత్తా చాటాలని కోరారు. లక్షలాది మందితో జన సమీకరణ చేసి మోదీ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ క్యాడర్‌‌కు దిశానిర్దేశం చేశారు. -