బీజేపీకి అవకాశమిస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ : బండి సంజయ్

బీజేపీకి అవకాశమిస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ : బండి సంజయ్
  • బీజేపీకి అవకాశమిస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ
  • జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. వయో పరిమితిని సడలిస్తం: సంజయ్

కరీంనగర్, వెలుగు :  ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి అవకాశమిస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్​ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా జాబ్ క్యాలెండర్​ను ప్రకటిస్తామని, వయోపరిమితిని సడలించి నిరుద్యోగులకు జరిగిన నష్టాన్ని పూడుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీసీ నాయకుడే సీఎం అవుతారని మరోసారి స్పష్టం చేశారు. కరీంనగర్​లోని 24వ డివిజన్​లో మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు.

ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేయాలని కోరారు. తన నామినేషన్ ర్యాలీని చూసి మైండ్ బ్లాంక్ అయిన బీఆర్ఎస్ నాయకులు.. డబ్బులిచ్చి వేలాది మందిని తీసుకొచ్చి పోటీగా ర్యాలీ నిర్వహించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. తొమ్మిదేండ్లుగా ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటూ మభ్యపెడుతున్న కేటీఆర్ మాటలు నమ్మొద్దన్నారు.

‘‘బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడట.. మరి ఈ 9 ఏండ్లు నువ్వు చేసిందేమిటి? ఏ గడ్డి పీకినవ్? ఎందుకు ఉద్యోగాలియ్యలే? జాబ్ క్యాలెండర్ ఎందుకియ్యలే? నిరుద్యోగుల ఉసురు ఎందుకు పోసుకున్నవ్? అసలు మళ్లీ నీ ప్రభుత్వం వస్తే కదా..” అని కేటీఆర్​పై సంజయ్ ఫైర్​ అయ్యారు. 50  లక్షల మంది నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టబోతున్నారని కేసీఆర్ కొడుకుకు అర్థమైందన్నారు.  

రాజకీయ వారసుడిని ప్రకటించే దమ్ముందా

కేసీఆర్​కు దమ్ముంటే.. ఆయన రాజకీయ వారసుడెవరో, ఎన్నికల తర్వాత ఎవరిని సీఎం చేస్తారో ప్రకటించాలని బండి సంజయ్​ సవాల్ విసిరారు.‘‘బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని చెప్పే దమ్ము కేసీఆర్​కు ఉందా? కనీసం గతంలో ఇచ్చిన మాటపై నిలబడి రాష్ట్రానికి దళితుడిని సీఎం చేసే దమ్ముందా? నువ్వు నిజంగా మనిషివైతే.. నీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే.. నీ రాజకీయ వారసుడెవరో ప్రకటించే దమ్ముందా? నా సవాల్  కు స్పందించాలి..’’ అని సంజయ్​ పేర్కొన్నారు.