మిలియన్ మార్చ్ తరహా.. నిరుద్యోగ మార్చ్

మిలియన్ మార్చ్ తరహా.. నిరుద్యోగ మార్చ్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన 30 లక్షల మంది విద్యార్థులతో.. నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని సంచలన ప్రకటన చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. మార్చి 22వ తేదీ బుధవారం ఆయన హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మిలియన్ మార్చ్ తరహాలో.. 30 లక్షల మంది స్టూడెంట్స్ తో నిరుద్యోగ మార్చ్ నిర్వహించి తీరతామని స్పష్టం చేశారాయన. 

పేపర్ లీకేజీ కేసులో సిట్ ఇప్పటి వరకు సాధించిందేమీ లేదని.. సీఎం సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ గా సిట్ దర్యాప్తు ఉందని ఎద్దేవ చేశారాయన. టీఎస్ పీఎస్ పేపర్ లీక్ కేసులో తాము సిట్ దర్యాప్తును ఒప్పుకోవట్లేదని.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. నయీం కేసు, మియాపూర్ భూకుంభకోణం,  డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.

సిట్ నోటీసులివ్వాల్సింది తమకు కాదని.. సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు ఇవ్వాలన్నారు. పేపర్ లీక్ కేసుపై ఎవరు మాట్లాడకుండా నోటీసులిస్తున్నారని మండిపడ్డారాయన. 30 లక్షల నిరుద్యోగుల బతుకులు ఆగం చేయడం సర్వసాధారణమా.? అని ప్రశ్నించారు.  ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోమన్నారు. 

 తప్పు చేస్తే కేసులు పెట్టాలి కానీ   తీన్మార్ మల్లన్న ఇంటిపై దాడి చేయడమెందుకని  బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించే అన్ని మీడియా సంస్థల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.  మీడియా కూడా ఏకం కావాల్సిన అవసరముందన్నారు. మళ్లీ ఎమర్జెన్సీ రోజులు స్టార్ట్ అయ్యాయని చెప్పారు.