లక్షలాది మందితో హైదరాబాద్ లో నిరుద్యోగ మార్చ్: బండి సంజయ్

లక్షలాది మందితో హైదరాబాద్ లో  నిరుద్యోగ మార్చ్: బండి సంజయ్

మంత్రి కేటీఆర్ పై బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ తీవ్ర  స్థాయలో ధ్వజమెత్తారు. కేటీఆర్ ది కొంపలుముంచే తెలివని..  అమెరికాలో చిప్పలు కడిగే బతుకని  మండిపడ్డారు. సంగారెడ్డిలో చేపట్టిన బీజేపీ నిరుద్యోగ మార్చ్ లో మాట్లాడిన బండిసంజయ్.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనతో  30 లక్షల మంది  జీవితాలను కేటీఆర్ నాశనం చేశారని విమర్శించారు.  

టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో కేటీఆర్ ను  బర్తరఫ్ చేసి.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేంత వరకు  వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్. నష్టపోయిన 30 లక్షల అభ్యర్థులకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలోనే లక్షలాది మందితో హైదరాబాద్  లో  నిరుద్యోగ మార్చ్ చేపడుతామని చెప్పారు. 

కేటీఆర్ రోజుకో మంత్రి అవుతాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్. ఏ శాఖలో  ఏ మంత్రి ఎంత దోచుకుంటుండో తెలుసుకుని ఆ దోపిడిని ఆయనే  దోచుకుంటారని ఆరోపించారు. కేటీఆర్ సోమవారం హోంమినిస్టర్, మంగళవారం హెల్త్ మినిస్టర్, బుధవారం ఫైనాన్స్ మినిస్టర్, శుక్రవారం ఇరిగేషన్ మినిస్టర్, శనివారం ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆదివారం నాడు మద్యం తాగి ఇంట్ల పడుకుంటారని విమర్శించారు బండి సంజయ్.

మరో ఐదు నెలల్లో  బీజేపీ అధికారంలోకి వస్తదని బండి సంజయ్ అన్నారు.  బిశ్వాల్ కమిటీ  చెప్పిన నివేదిక ప్రకారం  తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల నియామక ప్రక్రియను  స్టార్ట్ చేస్తామన్నారు.   ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు.

కేసీఆర్ పాలనలో  రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని విమర్శించారు బండి సంజయ్. తొమ్మిదేళ్లలో 9 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఇంత వరకు ఒక్క రైతు కుటుంబాన్ని కేసీఆర్  పరామర్శించలేదన్నారు. రైతులకు రుణమాఫీ  చెయ్యలేదని.. అకాల వర్షాలకు నష్టపోతే ఒక్క రైతును కూడా ఆదుకోలేదన్నారు. 

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని..నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు బండి సంజయ్.  మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు.