బీఆర్​ఎస్ అధికారంలోకొస్తే..  ఉన్న ఇండ్లు కూడా కబ్జా చేస్తరు : బండి సంజయ్

బీఆర్​ఎస్ అధికారంలోకొస్తే..  ఉన్న ఇండ్లు కూడా కబ్జా చేస్తరు : బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​కు పొరపాటున కూడా ఓటేయొద్దని, మళ్లీ కేసీఆర్​కు ఓటేస్తే రాష్ట్రంలో ఎవరూ తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. భూ కబ్జాలు, కమీషన్ల దందా మళ్లీ మొదలవుతాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చాననే అహంకారం పెరిగి.. కనబడ్డ ప్రతి ఇంటినీ కబ్జా చేస్తారని అన్నారు. ఖాళీ జాగా కనిపిస్తే ఆక్రమించుకుంటారని, అపార్ట్​మెంట్లు కడితే వాటా డిమాండ్ చేస్తారని ఆరోపించారు.

ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. బీజేపీ నేత శ్రీశైలం గౌడ్​పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద దాడి చేయడాన్ని సంజయ్ తీవ్రంగా ఖండించారు. గురువారం శ్రీశైలం గౌడ్ ఇంటికెళ్లి ఆయన్ను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ‘‘ఇలా దాడులు చేసేందుకేనా తెలంగాణ సాధించుకున్నాం? కుత్బుల్లాపూర్​లో గెలిచేది బీజేపీనే.. బీఆర్ఎస్ గూండాలకు గుణపాఠం చెప్పేందుకు పార్టీ లీడర్లు, కార్యకర్తలు రెడీ అవుతున్నరు”అని సంజయ్ ప్రశ్నించారు. 

వివేకానందపై కేసు పెట్టాల్సిందే..

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని, బీఆర్ఎస్​కు కొమ్ము కాస్తున్న అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ హెచ్చరించారు. ‘‘తెలంగాణ ప్రజలారా.. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా.. అంబేద్కర్ రాజ్యాంగం కావా లా? నిర్ణయించుకోండి. వివేకానందపై కేసు పెట్టాల్సిందే. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాల్సిందే. అప్పటి దాకా ఆందోళనలు చేస్తూనే ఉంటాం”అని సంజయ్ హెచ్చరించారు. ‘‘పేరేమో.. వివేకానంద.. చేష్టలేమో ఔరంగ జేబు లెక్కున్నయ్.. ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ లీడర్లు దాడులు చేస్తున్నరు. మా సహనాన్ని చేతగానితనంగా భావించొద్దు. ఒక్కో బీజేపీ కార్యకర్త శివాజీ లెక్క మారితే.. మిమ్మల్ని ఔరంగజేబును తరిమినట్లు ఉరికిస్తరు”అని బీఆర్ఎస్ లీడర్లపై సంజయ్ మండిపడ్డారు. 

వాటాల కోసం బెదిరిస్తున్నడు

అధికార పార్టీ ఎమ్మెల్యేగా వివేకానంద కుత్బుల్లాపూర్ సెగ్మెంట్​కు చేసిందేమీ లేదని బండి సంజయ్ అన్నారు. అన్ని సర్వేలు బీజేపీ అభ్యర్థి శ్రీశైలం గౌడ్ గెలుపు ఖాయమనే చెబుతున్నాయని వివరించారు. ఇండ్లు, జాగాలు కొన్నా.. వాటా ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే ఇలాగే దాడులు చేస్తానంటూ ఓపెన్​గానే వార్నింగ్ ఇచ్చారని విమర్శించారు.