ఇంద్రవెల్లి, వెలుగు : పుష్యమాసం, అమవాస్యను పురస్కరించుకొని జనవరి 18న కేస్లాపూర్ నాగోబా జాతర నిర్వహణకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెస్రం వంశీయులు ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామానికి చేరుకొని నాగోబా దేవస్థానం (మురాడి)లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాగోబాకు, నెలవంకకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
జనవరి18న నాగోబాకు నిర్వహించే మహాపూజలతో పాటు జాతర నిర్వహణకు ఉపయోగించే గంగాజలం సేకరణ కోసం గ్రామాల్లో ప్రచారం నిర్వహించే ఎడ్లబండిని మంగళవారం ప్రారంభించనున్నట్లు మెస్రం వంశీయులు తెలిపారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు వెంకటరావు పటేల్, చిన్ను పటేల్, బాజీరావు పటేల్, లింబారావ్ పటేల్, కోసు కటోడ, కటోడ హనుమంతరావ్, కోసేరావ్ కటోడ, మెస్రం మనోహర్, గణపతి, దాదారావ్, తిరుపతి, దేవ్రావ్, సోనేరావ్, నాగనాథ్ పాల్గొన్నారు.
