సమ్మక్క- సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ పమేలా సత్పతి

సమ్మక్క- సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు  : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,టౌన్ వెలుగు: జనవరి 28 నుంచి 31 వరకు జిల్లాలో నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌లో దేవాదాయ శాఖతోపాటు వివిధ శాఖల​అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో జాతర జరిగే ప్రదేశాల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

వాహనాల పార్కింగ్‌‌‌‌కు స్థలాల గుర్తింపు, హైమాస్ట్‌‌‌‌ లైట్లు, బారికేడ్స్‌‌‌‌, తాగునీరు, శానిటేషన్‌‌‌‌.. తదితరాలపై ఫోకస్‌‌‌‌ చేయాలన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ జిల్లాలో రేకుర్తి, హుజూరాబాద్, కేశవపట్నం, వీణవంక, జూపాక, చల్లూరు, చింతకుంట, హౌసింగ్ బోర్డ్ కాలనీలలో జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. 

అనంతరం నిర్వహించిన జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. పోలీస్, ఎక్సైజ్ ఆఫీసర్లు కోఆర్డినేషన్ తో డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలన్నారు. 

భరోసా కేంద్రం సేవలు భేష్

కొత్తపల్లి, వెలుగు: జిల్లాలో భరోసా కేంద్రం అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ అన్నారు. పోలీసుశాఖ, మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో కొత్తపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న భరోసా కేంద్రం మొదటి వార్షికోత్సవానికి సీపీ గౌష్​ ఆలం, కలెక్టర్​ పమేలా సత్పతితో కలిసి హాజరై కేక్​కట్​ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ క్రైమ్, డ్రగ్స్‌‌‌‌, పిల్లలు, మహిళలపై వేధింపులు వంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు.

 మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల నివారణకు, వేధింపులకు గురైన సమయంలో ఆదరణకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏడాది కింద ప్రారంభమైన భరోసా కేంద్రం అనేక కేసుల్లో మహిళలు, చిన్నారులకు అండగా నిలిచి బాధితుల్లో ధైర్యాన్ని నింపిందన్నారు.