- పోలీసులపై చేయి చేసుకున్నా కేసుల్లేవ్.. ఇదేం పాలన: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: ‘ముఖ్యమంత్రి గారూ.. పాతబస్తీని ఏమైనా మజ్లిస్‌కు రాసిచ్చారా? ఎంఐఎం నేతలు ఎవరిపైనైనా దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, దొంగతనాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా..’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులపై మజ్లిస్ నేతలు దాడులు చేసినా వారిని అరెస్టు చేయకపోవడం సరికాదన్నారు. సోమవారం పాతబస్తీలోని హైకోర్టు సమీపంలో మురళీధర్ ఆలయాన్ని దర్శించుకున్న బండి సంజయ్.. అనంతరం అక్కడ నివసిస్తున్న బెంగాలీ కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాతబస్తీలో చట్టం అమలు కావడం లేదన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చిన చోటే గంటల వ్యవధిలో మళ్లీ బిల్డింగులు కడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పాతబస్తీలో అధికారులపై దాడులు చేస్తున్న మజ్లిస్ గూండాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చేతగానితనానికి ఇదే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనలో హిందువులకు, దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని, గోవధ, లవ్ జీహాద్ పెరిగిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పాతబస్తీలో బెంగాలీ పిల్లలకు మజ్లిస్ గూండాలు డ్రగ్స్ ఎర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు, హైదరాబాద్‌లో ఉంటున్న దాదాపు 60 వేల మంది బెంగాలీలు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేయాలని కోరారు. మమతా బెనర్జీ చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ పరుస్తూ దేశ భద్రతకే ముప్పు తెస్తున్నారని, బంగ్లా చొరబాటుదారుల ఓట్లతో గెలవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో బీజేపీకి ఓటేయాలని.. అక్కడి బంధువులకు, స్నేహితులకు చెప్పాలని కోరారు.
