దుబ్బాకలో గెలిచేందుకు ఇదే కరెక్ట్ టైం

దుబ్బాకలో గెలిచేందుకు ఇదే కరెక్ట్ టైం
  • టీఆర్​ఎస్​పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది
  • సర్కార్​ ఫెయిల్యూర్స్​ను ఎండగడుదాం
  • జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాషాయ జెండా ఎగరాలి
  • బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల భేటీలో పార్టీ నేతలు

హైదరాబాద్, వెలుగురాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని, సీఎం కేసీఆర్ తీరుపై జనం అసంతృప్తితో ఉన్నారని, దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటే ఏ ఎన్నికల్లో నైనా ఎగిరేది కాషాయ జెండానేనని బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశంలో పలువురు సీనియర్లు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఇదే అసలు మోఖా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి, పార్టీ స్టేట్  చీఫ్ బండి సంజయ్,  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీలు అర్వింద్, సోయం బాపూరావు తదితరులు అభిప్రాయపడ్డారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో సంజయ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. దీనికి వివిధ జిల్లాలకు చెందిన రాష్ట్ర నేతలు హాజరయ్యారు. గత అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల సందర్భంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని, దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని సమావేశంలో చర్చ జరిగింది. అసంతృప్తులను తమ వైపు తిప్పుకుంటే రాష్ట్రంలో బీజేపీకి తిరుగు ఉండదని అభిప్రాయం వ్యక్తమైంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పక్కాగా ప్రచారం సాగించాలని నేతలు సూచించారు. టీఆర్​ఎస్​ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ను ఓడించడానికి ప్రజలు ఉత్సాహంతో ఉన్నారని సమావేశంలో పలువురు నేతలు అన్నారు. హైదరాబాద్​ అభివృద్ధికి టీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకాని విషయాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎండగట్టాలని, ప్రభుత్వ ఫెయిల్యూర్స్​ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. గ్రేటర్​లోని కేడర్​ను నాయకులు ఎప్పటికప్పుడు కో ఆర్డినేట్​ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సమావేశంలో సూచించారు. రాష్ట్రంలోని ప్రతి సంక్షేమ పథకానికి కేంద్రం ఇస్తున్న వాటా గురించి ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.

ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమం

గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ స్థానంతో పాటు నల్గొండ–వరంగల్–ఖమ్మం సీటును గెలుచుకునేందుకు ఆయా జిల్లాల నేతలు కలిసి పనిచేయాలని సమావేశంలో బీజేపీ నేతలు చర్చించారు. గ్రాడ్యుయేట్లకు ఓటు హక్కు కల్పించేందుకు బాధ్యత తీసుకోవాలని, ఎన్ రోల్​మెంట్​ కార్యక్రమం చేపట్టాలన్నారు. కేంద్రం తెచ్చిన  కొత్త వ్యవసాయ చట్టాలను బీజేపీ రాష్ట్ర కమిటీ అభినందించింది. ప్రధాని మోడీకి రాష్ట్ర బీజేపీ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం తీర్మానం చేసింది. ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లను టీఆర్​ఎస్​ సర్కార్​ అమలు చేయడం లేదని, అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాలని  నిర్ణయించింది. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని రాష్ట్ర​ సర్కార్​ చెప్పినా.. ఇప్పటి వరకు అమలుకు నోచుకోని విషయం చర్చకు వచ్చింది. గిరిజనుల రిజర్వేషన్లు, వారి హక్కుల కోసం పార్టీ పరంగాచేపట్టాల్సిన ఆందోళనలపైనా నేతలు చర్చించారు.