సాలు గంగుల.. సెలవు గంగుల.. బై బై గంగుల : బండి సంజయ్

సాలు గంగుల.. సెలవు గంగుల.. బై బై గంగుల : బండి సంజయ్

కరీంనగర్​లో ప్రధాన పార్టీల మధ్య ప్రచారం హోరెత్తుతోంది. బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి పురుమల్ల శ్రీనివాస్ ఎన్నిక బరిలో ఉన్నారు. గంగుల, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బుధవారం (నవంబర్ 15న) కరీంనగర్ రాంనగర్ లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్​ ప్రభుత్వం, మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. సాలు గంగుల.. సెలవు గంగుల.. బై బై గంగుల అన్నారు. ఓటుకు రూ.10 వేలు, లక్ష సెల్ ఫోన్లను గంగుల నమ్ముకున్నాడని ఆరోపించారు. తాను ధర్మాన్ని, ప్రజలను, కార్యకర్తలను నమ్ముకున్నానని చెప్పారు. ఓట్లు, సీట్ల కోసం ఎంతకైనా దిగజారే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అని అన్నారు. 

కరీంనగర్ కమలాకర్.. దారుస్సలామ్ కు పోతే కమ్రుద్దీన్ గా మారుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. కరీనంగర్ ప్రజలు తనను ఎంపీగా గెలిపిస్తే.. గర్వపడేలా కేసీఆర్ పై యుద్ధం చేశానని చెప్పారు. తెలంగాణ పేరును తీసి..  బీఆర్ఎస్ గా మార్చుకున్న కేసీఆర్ కు తెలంగాణ పేరు ఎత్తే అర్హతే లేదన్నారు. సాధు సంతువులారా... బయటకు రండి.. హిందూ సంఘటిత శక్తిని ఓటు బ్యాంకుగా మార్చండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.