కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రికి బండి సంజయ్ లేఖ

కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రికి బండి సంజయ్ లేఖ
  • సర్పంచులకు తెలియకుండా నిధులు డ్రా చేశారు: బండి సంజయ్

హైదరాబాద్​, వెలుగు: సర్పంచ్​లు, ఉప సర్పంచులకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వారి బ్యాంకు ఖాతాల డిజిటల్ కీ ఆధారంగా 15వ ఆర్థిక సంఘం నిధులను విత్ డ్రా చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాత బకాయిలు చెల్లించేందుకు ఆ నిధులు వినియోగించారని ఆయన పేర్కొన్నారు. 

నిధుల దుర్వినియోగం జరిగిందని, దానిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి గిరిరాజ్ సింగ్ కు సంజయ్  మంగళవారం లెటర్​ రాశారు. కొన్ని రోజుల క్రితం 15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఫండ్స్ విడుదల చేసిందన్నారు.

 ‘‘పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆ డబ్బును డ్రా చేసి, ఆయా గ్రామ పంచాయతీలోని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అధికారం సర్పంచులకు మాత్రమే ఉంటంది. గ్రామ పంచాయతీ కమిటీ తీర్మానం ఆధారంగా వారికి ఆ డబ్బును డ్రా చేసే అధికారం ఉంటది. 50 శాతం నిధులు రహదారుల నిర్మాణానికి, మిగిలిన 50 శాతం నిధులు సంక్షేమం, నిర్వహణకు వెచ్చించాలి. అయితే ఆ నిధులను సర్పంచ్​లకు తెలియకుండానే అధికారులు వాడుకున్నారు. ఈ విషయమై తెలంగాణలో అన్ని ప్రాంతాలకు చెందిన సర్పంచులు నన్ను కలిసి, నిధులు తిరిగి తమ ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు” అని సంజయ్​ ఆ లేఖలో పేర్కొన్నారు.