
బ్యాంకాక్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ లో దారుణం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే సియామ్ పారగాన్ మాల్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
కాల్పులు జరిగిన వెంటనే చిన్నారులు, మహిళలు భయంతో మాల్ డోర్స్‌ను తోసుకుంటూ బయటకు పరుగుతీశారని పోలీసులు వెల్లడించారు. అనంతరం తాము మాల్‌లోకి ప్రవేశించి టూరిస్టులను, ఇతరులను బయటకు పంపామని చెప్పారు. ఆ తర్వాత గంటలోపే నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు.
కాల్పులకు సంబంధించిన వీడియోలు నెట్లో వైరల్‌గా మారాయి. దుండగుడిని చూసి ప్రజలు బయటకు పరుగులు తీస్తున్నట్లు వీడియోల్లో కనిపించింది. నిందితుడు బేస్ బాల్ టోపీ, ముదురు చొక్కా, ప్యాంటు ధరించి చేతిలో తుపాకీతో ఉన్నాడు. ఘటనపై థాయ్‌లాండ్ ప్రధాని విచారం వ్యక్తం చేశారు. కాల్పుల ఉదంతంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.