IPL మ్యాచులు చూడం.. చూడనీయం : ప్రసారాలపై బ్యాన్ విధించిన బంగ్లాదేశ్

IPL మ్యాచులు చూడం.. చూడనీయం : ప్రసారాలపై బ్యాన్ విధించిన బంగ్లాదేశ్

IPL 2026 మ్యాచుల ప్రసారాలపై బ్యాన్ విధించింది బంగ్లాదేశ్. రాబోయే ఐపీఎల్ సీజన్ లో జరిగే మ్యాచ్ లను బంగ్లాదేశ్ లో ప్రసారం చేయం అని.. ఐపీఎల్ క్రికెట్ మ్యాచులను ఎవరూ చూడం అని.. ఎవర్నీ చూడనీయం అంటూ బంగ్లాదేశ్ తేల్చిచెప్పింది. ఈ మేరకు బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం.. అక్కడి స్పార్ట్స్ ఛానెల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. 

ఇండియా, బంగ్లాదేశ్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో.. ఐపీఎల్ లో ఆడుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ పై బీసీసీఐ వేటు వేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ టీంలో ఉన్న రెహ్మాన్ ను.. 9 కోట్లకు కొనుగోలు చేసింది ఆ జట్టు. బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులు.. హిందువులను చంపుతున్న అల్లరిమూకల వైఖరితో.. బంగ్లాదేశ్ క్రికెటర్ రెహ్మాన్ పై నిషేధం విధించింది బీసీసీఐ. 

ఈ పరిణామాల తర్వాత.. బంగ్లాదేశ్ కౌంటర్ ఎటాక్ కు దిగింది. ఐపీఎల్ మ్యాచ్ లను ప్రసారం చేయం అని తేల్చిచెప్పింది. మా దేశంలో ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించిన అన్ని ప్రమోషన్స్, ప్రసారాలు నిలిపివేసినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని అక్కడి ప్రభుత్వం  జీవో జారీ చేసింది. 

ఐపీఎల్ సీజన్ మ్యాచులకు బంగ్లాదేశ్ లోనూ పెద్ద మార్కెట్ ఉంది. కోట్ల సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ టీవీల్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచులు రాకపోతే.. వాళ్లకు ప్రత్యామ్నాయం ఏంటీ.. ఎలా చూస్తారు అనేది ఆసక్తి రేపుతోంది. టెలికాస్ట్ ద్వారా వచ్చే ప్రకటనలపైనా ఈ ప్రభావం పడనుంది. ఆదాయం తగ్గనుంది.